Saturday, June 2, 2007

బాదంకాయ పళ్ళెం

ఇవ్వాళ మధ్యాహ్నం భోజనం చేసేప్పుడు మా అబ్బాయి (కొడుకు)తో చాలా పెద్ద గొడవే అయింది! తింటే తిను లేకుంటే మానేయ్ అన్నదాకా వెళ్ళింది వ్యవహారం.
సాయంత్రమయ్యాక మా అమ్మకు యధాలాపంగా ఫోన్ చేసాను. చాలా రోజులౌతోంది ఫోను చేసి అన్నదామె.
మీ మనవడు నాక్కాస్త టయమిస్తే కదా ఫోను చేసేది అన్నా! పిల్లలు పుట్టకముందు, ఎవరైనా పిల్లలను సాకుగా చూపించి - ఫంక్షన్లు ఎగ్గొట్టినప్పుడు, బోర్ కొట్టే పూజలకు రానప్పుడు ... ఆహా పిల్లలున్న వాళ్ళ పని ఎంత హాయి! ఎంచక్కా పిల్లల పేరు చెప్పి నానా హింస తప్పించుకుంటున్నారు అని తెగ కుళ్ళు కునే వాళ్ళం. కానీ మాకూ పిల్లలొచ్చాక( మాకు ఇద్దరు - ఒకబ్బాయి ఒకమ్మాయి), పిల్లలు గల వాళ్ళ బాధలు అర్థమవుతున్నాయి. కుళ్ళు స్థానంలో, జాలి చేరింది! మొన్నీ మధ్య ఒకరికి ఫోను చేసి, చిన్నపాటి confession కూడా ఇచ్చేసాను.
మళ్ళీ మా అమ్మతో ఫోను సంభాషణలోకి వస్తే - అంత అల్లరి చేస్తున్నాడా అనడిగింది. వాడు అల్లరి స్థాయిని ఏనాడో దాటేసాడు, అల్లరికి కొత్త అర్థాలు చెబుతున్నాడు అని వాపోయా!
ఇంతకీ ఏమి చేసాడు అనడిగింది.
వాడి ఫ్రెండెవడికో Cars movie charectars బొమ్మలున్న కంచం, గిన్నె (bowl), గ్లాసూ ఉన్నాయట. అవి తనకూ కొనాలట. వాటిలోనేఆహారం, ఫలహారం మింగుతాడట... అంటూ మళ్ళీ కోప్పడుతూ చెప్పాను.
పాపం పిల్లాడు అంది మా అమ్మ.
నీలాంటి వాళ్ళ వల్లనే పిల్లలు చెడి పోతున్నారు అన్నాను.
పోన్లే వాడేదో ముచ్చట పడుతున్నాడు కొనిద్దూ అంది.
నన్నేదో వూరడిస్తుందని తనముందు వాపోతే, ఈవిడ కూడా వాడినే వెనకేసుకొస్తోంది ... అందుకే అసలు కంటే వడ్డీ ముద్దంటారు.
ఇంత పెద్దదానివి నువ్వే అలా అంటే ఎలా? ఏ పళ్ళెం లో తింటే ఏమిటి? తినే అన్నం కూరలూ ఒకటే కదా అన్నాను కోపంగా!

అబ్బా ఆ వయసులో వాడికవేమి తెలుస్తాయి - పాపం వాడడిగింది ఇవ్వొచ్చుగా అంటూ ఆవిడ మొదలెట్టింది.

Cars movie లో కారెక్టర్లన్నీ వాడికి తెలుసు. ఏ పళ్ళెంలోనైనా తినే పదార్థాలు ఒకటేనని ఎందుకు తెలియదు అనడిగాను.

నువ్వూ చిన్నప్పుడు అంతే! చిన్నప్పుడేమిటి, హైస్కూల్లో చదువునకునేటప్పుడూ అంతే. బాదంకాయ పళ్ళెంలో తప్పితే తిననని! అప్పుడు నేనూ నీకులాగే చాలా లాజిక్కులు చెప్పేదాన్ని. నువ్వు వింటేగా! చుట్టాలొచ్చినప్పుడు కూడా నీ పళ్ళెం నీకే కావాలని ఒకటే గోల. గుర్తు లేదా అడిగింది అమ్మ!

మా ఇంట్లో బాదం షేపు పళ్ళెం, వంకులున్న స్టీలు గ్లాసు నాకింకా గుర్తే! వాటిలోనే తినాలని తాగాలని మారాం చేయడం ఇప్పుడిప్పుడే గుర్తుకొస్తోంది. అప్పుడప్పుడూ అలగడం కూడా!

అంత బాగా గుర్తులేదు...అంటూ కార్ తాళాలు తీసుకుని - సర్లే అమ్మా మళ్ళీ కాల్ చేస్తా. షాపులు కట్టేసే టయమయింది... వాడికా ప్లేటు గిన్నె కొనుక్కొస్తా అంటూ ఫోను పెట్టేసాను, మా అబ్బాయిని తీసుకుని షాపుకు బయల్దేరడానికి సిద్ధ మవుతూ!

3 comments:

radhika said...

ఈ వ్యాసం లోని నీతి- ఏదీ మనదాకా వస్తేనే గానీ తెలీదు [నాకు కూడా మా వాడు వచ్చేదాకా ఏమీ తెలీలెదులెండి]

కొత్త పాళీ said...

sweet!

రానారె said...

తల్లిదంఢ్రులు సంపాదించిన జ్ఞానం పిల్లలకు పుట్టగానే వచ్చేట్టయితే మానవ జన్మ ఇంత రసవంతంగా ఉండేదికాదేమో. ఎక్కడో చదివాను "ప్రతి మనిషీ చిన్నప్పుడంతా తనకు తోచినదారిలోనే పనులు చేస్తూనే ఉంటాడు - పెద్దల అనుభవాన్ని అంగీకరించే వయసొచ్చేదాక. తరువాత ఆ పెద్దల అనుభవమే మనిషికి చాదస్తంగా కనిపించడం మొదలౌతుంది. తరువాతి తరం కూడా ఇదే దారి."