'కీర్తి కోసం కోటి ఎత్తులు' అనిపిస్తుంది కొందరిని చూస్తుంటే, కొందరి చేష్టలు వింటుంటే!పాటలు పాడడమంటే అమితోత్సాహమున్నట్లు అగుపించే ప్రాణి ఒకడున్నాడు. ఉండడమేగాక నాకు స్నేహితుడుకూడా అయ్యాడు. అతడి పేరు 'వాసు'(అనుకుందాం)!
వాసుని ఎప్పుడు కలిసినా, ఏదో మూలుగుతున్న శబ్దం చేస్తూ, కనిపించేవాడు మత్తెక్కిన కళ్ళ తో! పరిచయమైన క్రొత్తల్లో, ఏదైనా బాధతో ఏడుస్తున్నాడేమో అనుకునే వాణ్ణి!
ఒక రోజు 'నీకొచ్చిన కష్టమేమిటో చెప్పు బాసు' అనడిగాను కూడా!
'అబ్బే కష్టమేమీ లేదు. రసగంగలో ఈదులాడే టప్పుడు ఇలాగే కనిపిస్తాను. నావి ఏడుపుగొట్టు కళ్ళు కావు - అర్థ నీమిలత నేత్రాలు' అన్నాడు వాడు.
దాంతో నాకేడుపొచ్చినంత పనైంది!
గొంతు బాగోదు. అందుకునే పాటలు అఘోరించినట్లుంటాయి. Facial expressions ఏడ్చినట్లుంటాయి. వీటన్నింటికీ తోడు, సగం మూసిన కళ్ళతో, ఆ మూలుగొకటి!
వూళ్ళో శ్రీరామనవమి పందిళ్ళలో వీడిని చూసి మైకులు దాచేయడం ఎప్పటినుంచో జరుగుతోంది.
ఈ మధ్యన పెళ్ళి కొడుకులు, వీడు పెళ్ళి మండపాల ఛాయలకు వస్తే, పెళ్ళి పీటల మీంచీ 'లేచి' పోతామని ప్రకటించేశారు. ఆడ పెళ్ళి వారు, వీడిని పెళ్ళిళ్ళకు పిలవడం మానేసారు.
ఊళ్ళో దొంగల హడావిడి ఉన్నప్పుడు, ఊరి జనం రాత్రుళ్ళు వంతులు వేసుకుని కాపలా తిరిగినట్లు - పెళ్ళి పందిళ్ళ దగ్గర కొంత మంది వీడిని అడ్డుకోడానికి వంతులు వేసుకుని కాపలా ఉండడం మొదలెట్టారు.
కొన్నాళ్ళు పాపం చిన్న పిల్లలు దొరికిపోయే వాళ్ళు...ఏదో చాక్లెట్లకు , బిస్కట్లకు ఆశ పడి! వీడి పాట కచేరీ దెబ్బకు, పిల్లలకు దడుపు జ్వరాలు రావడం మొదలయ్యాక - పెళ్ళి పందిళ్ళ కాపలా వ్యవస్థ పిల్లల సంరక్షణ వరకు విస్తరించింది.
ఇంత జరుతున్నా - వాసు వాడి మానాన వాడు, పాటలు రాసుకుంటూ, పాడుకుంటూ ఉన్నాడు! పైపెచ్చు - రోడ్డు మీద పోయే ఏనుగు, మొరిగే కుక్కల్ని పట్టించుకుంటే ఎలా అని, తన్ని తాను ఏనుగును చేసుకుని - తన టాలెంటు చూసి ఓర్వలేని కుళ్ళు బోతు జనం అరుపులు తానెన్నటికీ పట్టించుకోనని - చెవుల్లో దూది పెట్టుకుని తన పాటనాపలేరని - పాట రూపంలోనే కక్కేవాడు.
మన ఖర్మ కాలి, పాట అయ్యేదాకా ఆ దరిదాపుల్లో ఉంటే, తన పాటలను ఎంత మంది ఎలా మెచ్చుకు(కుంటు)న్నారో చిట్టా విప్పి మరీ చెప్పేవాడు.
వినే వాళ్ళకు అసలు విషయం తెలిసినా, తెలియనట్లు నటిస్తూ వినోదం పొందేవాళ్ళు. వాడికి ఇంకో నాలుగు తాటాకులు కట్టి నవ్వుకునేవాళ్ళు.
వాసు ధ్యేయమల్లా మంచి గాయకుడిగా పేరు తెచ్చుకోవడం. విరివిగా సన్మానాలు, సత్కారాలు పొందడం.
ఒకసారి తెగించి, 'బాసూ - నీకేమైనా సంగీతం తెలుసా, ఎక్కడైనా నేర్చుకున్నావా' అనడిగా.
కోకిల ఎక్కడ నేర్చింది గానం, తంబురా ఎవడిదగ్గర నేర్చుకుంది రాగం అంటూ, చెవులు బొప్పి కట్టేలా, ఆశువుగా పాటలు కట్టి మరీ ఉతికి ఆరేసాడు.
అప్పటినుంచీ వాణ్ణి పూర్తిగా తప్పించుకు తిరగడం మొదలు పెట్టా! మిత్ర బృందంలో మిగిలిన వాళ్ళు కూడా అత్యవసరమైతే తప్ప వాసుకు ఎదురుపడటం మానేసారు.
అదలా ఉండగా, నిన్న ఒక స్నేహితుడు కాళ్ళకు చేతులకు బేండేజీలు కట్టుకుని కనిపించాడు, విషయమేమిటని పలకరించా!
ఒక్కసారిగా భోరు మన్నాడు. నిన్న ఏదో పొలిటికల్ పార్టీ మీటింగుకు వెళితే, అక్కడ అందరికీ షాకిస్తూ వాసు ప్రత్యక్షమయ్యాడట. కార్యకర్తలను తోసుకుంటూ వెళ్ళి, వేదిక నెక్కి, మైకు దొరక పుచ్చుకుని - పార్టీ మీద తను కట్టిన పాటను పదే పదే పాడటం మొదలెట్టాడట.
మంత్రిగారు బ్రతిమలాడినా, కార్యకర్తలు కాళ్ళా వేళ్ళా పడ్డా, పోలీసులు బెదిరించి మైకు కట్ చేసినా ఇసుమంతైనా కనికరించలేదట వాసు. దాంతో అందరూ తలో దిక్కుకు పరుగులు తీస్తూ పారిపోయారని, ఆ తొక్కిసలాటలో తనకు గాయాలయ్యాయని చెప్పాడు!
నాకు వెన్నులోంచీ వణకు పుట్టింది. చిరంజీవి స్టాలిన్ సినిమా చివరి సీనులో, లారీలోంచి ఒక రౌడీ ప్రకాష్ రాజ్ తో మాట్లాడుతూ - కత్తులు, బాంబుల రేంజి ని దాటి ఎక్కడికో ఎదిగి పోయాడని చెబుతాడు. అది గుర్తొచ్చింది నాకు, వాసును తలుచుకుంటే!
వాడి పాటల సత్తా వాడికి తెలియక - నిజంగానే తాను గొప్పగా పాడుతున్నానని, పాటలు కడుతున్నానని - వాసు అనుకొంటున్నాడని ఎందుకో నాకనిపించదు.
పోనీ ధనరూపంలో ఏమైనా లభిస్తోందా అంటే అదీలేదు.
మరెందుకిదంతా అంటే - ముతగ్గా చెబితే 'దురద', నాజూగ్గా చెప్పాలంటే 'కీర్తికండూతి'!
వాసు లాంటి వాళ్ళు, అన్ని రంగాల్లోనూ కనిపిస్తుంటారు!! తస్మాత్ జాగ్రత్త!!!
- అతిధి
Tuesday, June 5, 2007
Subscribe to:
Post Comments (Atom)


3 comments:
మీ వాసుకు తెలుగు బ్లాగు గురించి చెప్పండి ఎలాగోలా. పాటలే పాడుకుంటాడో, రాసుకుంటాడో ఆయనిష్టం. మనకిష్టం అయితే చదువుతాం లేకుంటే లేదు. పైగా ఆయనకు తగిన మితృలు ఈ భూమండలం మీద ఎక్కడో వుండక పోరు.
మీ కథనం చక్కగా వుంది.
--ప్రసాద్
http://blog.charasala.com
ఇంటర్మీడియట్ చదివేటప్పుడు ఇలాంటి వాగ్గేయకారుడొకాయన నా క్లాసుమేటుగా సంప్రాప్తించాడు. అంతేనా! ఆయనొక చిత్రకారుడు కూడా. ఆయన పాలబడిన ఒకానొక గేయరాజాన్ని మేమిప్పటికీ గుర్తుచేసుకొని నవ్వుకుంటుంటాము. "కొమ్మమీద కోయిల కూ కూ అన్నది" అనేది ఆగేయం. బాగనే ఉందే అంటారేమో, ఆ పాట పాడుతూ ఆ మనిషి తెచ్చిపెట్టుకునే తాదాత్మ్యత, పరవశం చూస్తే అర్జంటుగా తనువుచాలించాలనే తలపు కలుగుతుంది. అబ్బో, ఆయన చిత్రాలు గీసేటప్పుడు చేసే యాగీ చెప్పాలంటే చాలా ఉంది.
వాసు లాంటి వాళ్ళు చాలా మందే తారస పడతారు మనకి.కధనం చాలా బాగుంది.
Post a Comment