Monday, August 6, 2007

మొదటి అడుగే ముఖ్యం!

నేను చాలా మందిని చూసాను.
మీరు కూడా చూసే ఉంటారు.
వర్క్ స్కిల్స్ లో, కష్టపడే తత్వంలో, ఆలోచించే పద్ధతుల్లో, మాట్లాడ్డంలో మనకంటే బాగా వెనకబడ్డట్లు అనిపించే వాళ్ళను మనం చాలా మందిని చూసుంటాం. చాలా మంది మనకంటే వెనకబడ్డట్లు కనిపించడంలో కొంత వరకు మాత్రం 'కాకి పిల్ల కాకికి ముద్దు ' (కాపికాము) సిండ్రోం పని చేయవచ్చు.
గత పదిహేనేళ్ళలో నాకు తారసపడిన వాళ్ళను, తారసపడిన వాళ్ళలో నేను సన్నిహితంగా గమనించిన కొందరి గురించి నేనొక మాట చెబుదామనుకుంటున్నాను.
ఏ కంపెనీలో చేరినా, మూడు నుంచీ ఆరు నెలల లోపే పింక్ స్లిప్పులు తీసుకుని బయట పడ్డ వాళ్ళు, మళ్ళీ ఉద్యోగాలు దొరక్క 'బెంచ్ 'ల మీద నెలలకు నెలలు ఎదురు చూసిన వాళ్ళు నాకు తెలుసు. మీకూ తెలిసి ఉండొచ్చు!
వాళ్ళలా ఉద్యోగాల కోసం వెదుక్కుంటూ నిరాశా నిస్పృహలతో వేగలేని కొన్ని వేళల్లో మనం ధైర్యం చెప్పి ఉంటాం. చేతనైన సాయం చెయ్యడానికి చెయ్యందించి ఉంటాం. స్నేహితులుగా ఆ బాధ్యతలు నిర్వర్తించాక, సాటి మనుషులుగా - వారి కంటే మనం చాలా వీరులమని, శూరులమని, విజ్ఞాన దురంధులమని ఉప్పొంగి పోయుంటాం, సహజంగానే!
గొర్రె తోక బెత్తెడు ఉద్యోగాలు ఎన్నాళ్ళు చేస్తాం...ఏదైనా సొంత వ్యాపారం మొదలెట్టొచ్చుగా అన్న ఆలోచన రాగానే [మనకో, మన సాన్నిధ్యంలో మన సహచరులకో] వ్యాపారానికి అనుభవం కావాలని, ఆంగ్లం అనర్గళంగా మాట్లాడ్డం, ఆంగ్లం అందంగా వ్రాయడం తెలిసి ఉండాలని, మంచి భాగస్వాములుండాలనీ...ఇంకా ఏవేవో లక్షణాలుండాలని అనుకుని, ఆ ఆలోచనలను మొగ్గలోనే తుంపి ఉండవచ్చు.
ఉద్యోగాలు రాక విసుగెత్తి, బతకడం [సర్వైవల్]కోసం చిన్న చిన్న వ్యాపారాలు మొదలెట్టి, క్రొత్త క్రొత్త అనుభవాలు సంపాదిస్తూ...వ్యాపారాలను పెంచుకుంటూ, ఇంకొంత మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తున్న అప్పటి స్నేహితులను చూస్తుంటే ఆశ్చర్యమేస్తుంది కదూ! వాళ్ళా స్థాయికి వచ్చారన్న సంగతి నమ్మశక్యంగా ఉండదు.
నిజానికి కష్టపడకుండా, ఎలాంటి ప్రత్యేకమైన ప్రతిభ లేకుండా వాళ్ళా స్థాయికి వచ్చి ఉండరు. వాళ్ళు పడే కష్టాలను, వాళ్ళకున్న ప్రత్యేక ప్రతిభ గురించి ప్రస్తుతానికి ప్రక్కన పెట్టి...వాళ్ళకు మనకు ఉన్న ఒక పెద్ద తేడాను గురించి ఆలోచించినపుడు - వాళ్ళు మొదటి అడుగు వేయడానికి భయఫడని వారనిపించింది!
మనం చక్కగా ఉద్యోగాలు చేసుకుంటూనే ఉన్నాం. హాయిగానే ఉంటాం. కానీ మొదటి అడుగు వేయడానికి భయపడతాం!
బహుశా comfort zone లో ఉండే చాలా మంది మనలాగే ఉంటారేమో!!

5 comments:

VJ said...

బాగుంది ... దృఢనిర్ణయం అన్నది విజయపథంపై మనం మొదటి అడుగు అవుతుంది అని ఎక్కడొ చదివా.

లంబోదర్ said...

చాలా కరెక్ట్‌గా చెప్పారు!!

radhika said...

మొదటి అడుగు వెయ్యడానికి భయపడని వారుంటారా?మనం అడుగు వెద్దామా వద్దా అని అలోచిస్తూనే వుంటాము.కొంత మంది భయపడుతూనే చూద్దాం ఏమి అవుతుంది అనుకుంటారు.మీరు చాలా బాగా చెప్పారు.మీ ప్రతి పోస్ట్ లోనూ అందరి ఆలోచనలు కనిపిస్తాయి.

Naveen Garla said...

మంచి వ్యాసం. ఇలా నలుగురికీ ఉపయోగపడే వ్యాసం వ్రాసినందికు అభినందనలు.

- http://gsnaveen.wordpress.com

kalidasu501 said...

sir, మీకు నా అనుభవం చెప్పుతాను. నెను కుడా ఇలాగె అలొచించాను. మొదటి అడుగు వెయ్యడానికి. మా శ్రీమతి ప్రొద్బలం తొ ఈమద్యనె రాఖీ పందుగకు రాఖీలను అమ్మాం. లాభం వచ్చింది. వినాయక చవితి కి పత్రి, వెలగ కాయలు, మారేడు కాయలు అమ్మాం. బిజినెస్స్ బాగుంది. ఇప్పుడు దసరా, దీపావలి పండగలకు బంతి, ఛామంతి పువ్వులు మరియు టపాకాయలు (బాంబులు) అమ్మాలని అనుకుంటున్నాము. నేను వుద్యొగం చెస్తున్నాను. ఖాళీ సమయం లొ ఈ పనులు చెస్తు extra డబ్బులు సంపాదిస్తునాను.