Wednesday, August 8, 2007

మొదటి విజయం (ఈ శీర్షిక నప్పదని సందేహం. కానీ ఇంకేమి పెట్టాలో తెలియలేదు)

అయిదేళ్ళ క్రితం ఒక రోజు, ఆఫీసులో ఒక అత్యవసర సమావేశం జరిగింది. చాలా ఇష్యూలు పరిష్కరించబడకుండా పేరుకుపోతున్నాయని, కస్టమర్ల దృష్టిలో ఐ.టి. అంటే దురభిప్రాయం పెరుగుతోందనీ, దాన్ని వెంటనే తగ్గించేయాలని ఒక అరగంట ఉద్బోధ చేసి బాసు ఇంకో మీటింగు ఉందంటూ వెళ్ళి పోయాడు. మమ్మల్ని ఆ మీటింగ్ రూంలోనే కూర్చుని, ఇష్యూల గురించి చర్చించి, ఒక యాక్షన్ ప్లాన్ తో తనను మళ్ళీ కలవమని చెప్పాడు.

సభ్యుల్లో నేను తప్పించి మిగిలిన వాళ్ళందరూ బాస్ మాటల్ని 'లైట్' తీసుకున్నారు.

ఆ మధ్యనే ఆ కంపెనీలో చేరిన నాకు, మేనేజర్ మాటల్లో సీరియస్నెస్ కనిపించి, మిగిలిన వాళ్ళతో సమస్యలను ప్రాధాన్య క్రమంలో వర్గీకరించి, తలా కొన్ని కేటాయించుకుని పరిష్కరిద్దామన్నాను.

'నీ తెలివి మాకు లేదా? ' అన్నట్లు నా వైపొక సారి చూసి 'సమస్యలన్నీ పరిష్కరిస్తే మన అవసరం కంపెనీకేముంటుంది. ఉద్యోగంలోంచి సాగనంపుతారు. నువ్వసలే కాంట్రాక్టరువి. మాకంటే నీకింకా నష్టం కష్టం ' అన్నారు.

నిజమేనేమోననిపించింది, వినగానే!

కానీ, సొల్యూషన్ తెలిసినా కావాలని సమస్యలను మురగపెట్టడం తప్పని పించింది. అదే విషయాన్ని వాళ్ళతో చెప్పి అప్పటికప్పుడు ఎలా ఒప్పించాలా అని ఆలోచనలో పడ్డాను.

***

చాలా కంపెనీలలో - రోజు వారీ పనులకే సమయం చాలడంలేదు, ఇంక కొత్త ప్రాజెక్టులు ఎలా మొదలెడదాం అనుకుంటుంటూ ఉంటారు ఉద్యోగులు, మేనేజర్లు. సమస్యలకు తాత్కాలిక సర్దుబాట్లు చేసుకుంటూ కాలం గడుపుతుంటారు. ఉద్యోగులు ఎంత పని చేస్తున్నారు - అంటే ఎన్ని గంటలు ఆఫీసుల్లో గడుపుతున్నారు, లెక్కకు ఎన్ని సమస్యలు పరిష్కరిస్తున్నారు (how many number of issues resolved?) అన్న మెట్రిక్స్ (metrics) మీదనే మేనేజ్మెంట్ ఆధారపడితే సమస్యలెప్పుడూ 'క్యూ ' కడుతూనే ఉంటాయి (tickets always be in queue). ఉద్యోగులు వాటిని పరిష్కరిస్తూనే ఉంటారు!

ఎన్ని గంటలు పని చేస్తున్నారని కాకుండా ఎంత efficiency తో పని చేస్తున్నారని, ఎన్ని సమస్యలు పరిష్కరించారు అని కాకుండా...అసలన్ని సమస్యలెందుకు వస్తున్నాయని మేనేజ్మెంట్ సీరియస్ గా ఆలోచిస్తే అసలు కథ అర్థమౌతుంది.

ఒక చోటునుంచీ ఇంకో చోటుకు - ఉదాహరణకు హైదరాబాద్ నుంచీ విజయవాడకు -వెళ్ళడానికి చాలా చాలా మార్గాలు అందు బాటులో ఉంటాయి. హైదరాబాద్ నుంచీ విజాగ్ విమానంలో వెళ్ళి, అక్కణ్ణుంచీ రైల్లో విజయవాడ రావొచ్చు. లేకపోతే హైదరాబాద్ లో బయల్దేరి, భూమి చుట్టూ ఒక రౌండ్ కొట్టి, విజయవాడకు చేరవచ్చు. ఇంకా చాలా విధాలుగా చుట్లు తిరిగి గమ్య స్థానానికి వెళ్ళొచ్చు.

అయితే, నేరుగా విజయవాడ వెళ్ళే మార్గాల్లో, ఒక దగ్గర దారిని ఎంచుకొని ఆ దారిన వెళ్ళొచ్చు. అదే efficiency అంటే!

***

నా ఆలోచనలు ఒక కొలిక్కి వచ్చాయనిపించింది.
'సమస్యలను పరిష్కరించడానికే మనకు ఈ కంపెనీ జీతాలిస్తోంది. మనమీ సమస్యలన్నీ పరిష్కరిస్తే, ఉద్యోగాలు పోతాయనుకోవడం నమ్మశక్యంగా లేదు. ఈ పనులు efficientగా చేస్తే మనమీద customerకు నమ్మకం పెరిగి మనకు మరిన్ని ప్రాజెక్టులిస్తారు. ఇప్పుడు చేస్తున్న ఈ 'చిరిగిన బట్టలకు అతుకులు ' వేసే పనికంటే, ఇంకా మంచి పనులు చేసే అవకాశం మనకు దొరకొచ్చు. దాంతో మన స్కిల్స్ పెరుగుతాయి. Marketability పెరుగుతుంది. మన మీద మనకు నమ్మకం పెరుగుతుంది. అప్పుడు మనలాంటి రిసోర్సెస్ ను ఈ కంపెనీనే కాదు, ఏ కంపెనీకూడా వదులుకోలేదు ' అని చెప్పాను.
వాళ్ళలో నేను చెప్పిన విషయం ఎంత మందికి అర్థమైందో తెలియదు. ఒక ఇద్దరు మాత్రం నా వైపు ఆశ్చర్యంగా చూసారు, నన్ను అనుసరించారు.

***

మా టీంలో Down sizingలో ఉద్యోగాలు కోల్పోయిన వాళ్ళు, ముందనుకున్న టైంకు కాంట్రాక్టులు అయిపోయి వెళ్ళిపోయిన వాళ్ళున్నా - మూడు నెలల కాంట్రాక్టు పనికోసం వెళ్ళి - మూడేళ్ళ పాటు కాంట్రాక్టరుగా అదే కంపెనీలో ఆనందంగా పనిచేసాను!!నేనా రోజు మా టీం మేట్స్ కు మీటింగ్ రూంలో ఏమైతే చెప్పానో, వాటినే ఇప్పటికీ ఆచరిస్తున్నాను.

[ ఈ టపా చదివేవారు Efficiency, Principles అన్న పదాలకు సమానమైన మంచి తెలుగు పదాలేమైన తెలిస్తే తెలియజేయగలరా? - కృతజ్ఞతలు. ]

11 comments:

మాకినేని ప్రదీపు said...

అవును మీరు ఇక్కడ చెప్పింది ముమ్మాటికీ నిజమే...

కొత్త పాళీ said...

మంచి మాటలు చెప్పారు.

chava said...

efficiency - సమర్ధత
principles - నైతిక విలువలు
????

radhika said...

100% (మంచి చెప్పినందులకు)

Ravi said...

"మొదటి విజయం" మీ శీర్షిక కు తగిన పేరు. మంచి దృక్పదం తో పని చెస్తే భవిష్యత్ బాగుంటుంది అని నిరూపించారు.
కృతజ్ఞతలు

Naveen Garla said...

Marketability కి తెలుగు పదం వద్దా? దీనికి ఈ మధ్యనే తెలుగు పదం కనుక్కున్నాము. "విపణియోగ్యత"...ఎలా ఉంది పదం?

- http://gsnaveen.wordpress.com

ప్రవీణ్ గార్లపాటి said...

అవును నిజం...

తాడేపల్లి బాలసుబ్రహ్మణ్యం said...

ఉన్నంతలో చక్కటి తెలుగు ప్రయోగిస్తూ టపాలు రాస్తున్నారు. ఆనందంగా ఉంది. ఇలాగే ముందుకెళ్ళండి.

తాడేపల్లి బాలసుబ్రహ్మణ్యం said...

ఉన్నంతలో చక్కటి తెలుగు ప్రయోగిస్తూ టపాలు రాస్తున్నారు. ఆనందంగా ఉంది. ఇలాగే ముందుకెళ్ళండి.

అతిధి said...

వ్యాఖ్యలు వ్రాసిన వారికి (టపా చదివిన వారికి కూడా) కృతజ్ఞతలు.
@chava - efficiency సమర్థత, సామర్థ్యం సరిపోతాయనుకుంటా. కానీ principlesకు నైతిక విలువలు సరిఫొవడం లేదనిపితోంది! moral valuesను నైతిక విలువలు గా తర్జుమా చేస్తుంటారు కదా! అదీగాక, విలువలకు దన్నుగా ఉండేవి principles కదా? principlesను సూత్రాలు అనొచ్చేమో!
@naveen - marketabilityకి 'విపణియోగ్యత ' బాగుంది.

Naveen Garla said...

marketabilityకి = 'విపణియోగ్యత '
కనిపెట్టిన వారు = తాడేపల్లి బాలసుబ్రహ్మణ్యం గారు
స్థలం = తెలుగుపదం గుంపు