Sunday, September 23, 2007

రెండు జలక్‌లు

ఈ రోజు మా అబ్బాయి నాకు రెండు జలక్‌లిచ్చాడు.
కూరగాయల కొట్టులో రెండు పెద్దదా మూడు పెద్దదా అనడిగా, అదే పనిగా ఏదో కొనివ్వమని గోల పెడుతుంటే, కాస్త పక్క దారి పట్టిద్దామని!
రెండు పెద్దది అన్నాడు.
హమ్మయ్య దొరికాడు నా కొడుకు అనుకుంటూ, 'ఎలా?' అనడిగా.
సమాధానమెలా చెప్పాలో తట్టినట్లు లేదు. మొదట చెప్పిందే 'రెండు పెద్దది' అని మళ్ళీ అన్నాడు.
వన్, టూ, త్రీ...లు చెప్పమన్నా.
పది వరకు వరుస క్రమం లో చెప్పాడు.
టూ తర్వాత త్రీ వస్తుంది కాబట్టి త్రీ పెద్దది అని చెప్పా, అలా ఒప్పించగలననుకుని.
ఊహూ...ఒప్పుకోలేదు!
పైగా 'మరి జూలియా కంటే ఎల్లీ పెద్దది కదా' అన్నాడు.
పక్కింటి వాళ్ళ అమ్మాయిల ప్రస్తావన ఎందుకు తెచ్చాడా అని అనుకుంటుండగానే, లైట్ వెలిగి - 'అమ్మ నా కొడుకా...' అనుకున్నా!
మా పక్కింటి వాళ్ళ ముగ్గురు పిల్లల్లో ఎల్లీ (ఎలిజబెత్) రెండవది. మూడో అమ్మాయి పేరు జూలియా!
* * *
ఈ దెబ్బ నుంచీ తేరుకున్నాను అనుకున్నాక, సాయంత్రం కారులో చిన్న పనిమీద అందరం...అనగా పది నెలల నా కూతురుతో బాటు...బయటకు బయల్దేరాం.
మా అమ్మాయిని 'ఫేన్ ఏదమ్మా?' అనడిగితే, ఎక్కడున్నా, ఏమి చేస్తున్నా -తలపైకెత్తి చూస్తూ 'అదో' అన్న శబ్దం చేస్తుంది!
దారిలో ఒక సారి 'ఫేన్ ఏదమ్మా?' అనడిగాను నేను.
చైల్డ్ సీటులో తల వీలైనంత పైకెత్తి 'అదో' అంది.
నవ్వుకుంటూ, మా అబ్బాయిని 'నువ్వేమి చూస్తున్నావు?' అనడిగా.
'గ్రీన్ ఫేన్స్ చూస్తున్నా' అని శలవిచ్చాడు.
'గ్రీన్ ఫేన్సా?' అని ఆశ్చర్యంగా అడిగేసరికి - 'అదే...చెట్లు చూస్తున్నా'అన్నాడు నా కర్థమయ్యేలా చెబుతూ!
ఇప్పటికీ వాడికా ఊహ ఎలా వచ్చిందా అని ఆలోచిస్తున్నా! బహుశా నేను అనుకునేది, వాడు అనుకునేది (గ్రీన్ ఫేన్స్ అంటే) వేరు కావచ్చు. కానీ నాకైతే - చాలా పొయెటిక్ గా చెప్పాడనిపించింది(కాపికాము సిండ్రోం :-) )!
* * *
పిల్లలు చేసే సరదా పనులు, సంభాషణలు వ్రాసి దాచుకుందామని - జర్నల్ ఒకటి కొన్నాను మూడేళ్ళ క్రితం, మా అబ్బాయి పుట్టిన మూడు నెలల తర్వాత. అప్పట్నుంచీ ఆ పుస్తకాన్ని చెక్కు చెదరకుండా, సిరా మరక పడకుండా కాపాడుకొస్తున్నాం...తీరిక దొరక్క!
ఇకనుంచీ, ఇలా బ్లాగులో వ్రాసుకుని దాచుకోవచ్చేమోననిపించింది - ఇలాంటి జ్ఞాపకాలను!

10 comments:

radhika said...

ఎక్కడో అక్కడ దాచి[రాసి] పెడితే పిల్లలు పెద్దవాళ్ళయ్యాకా వాళ్ళకి మంచి బహుమతి ఇచ్చినవాళ్ళం అవుతాము.ఇంతకీ మీ బుడుగు వయసు ఎంత?

కొత్త పాళీ said...

తప్పకుండా .. ఈ బ్లాగులో ఇలాంటి సిరామరకలెన్నైనా రాయండి, బహు అందంగా ఉన్నాయి. కాపికాము ఫన్నీ :-)). మాక్కూడా ముద్దే! మీ వాడు మాత్రం అటు తర్కంలోనూ, ఇటు కవిత్వంలోనూ రెచ్చిపోయేట్టున్నాడు.

Raja Rao Tadimeti (రాజారావు తాడిమేటి) said...

బాగుంది. ఇలాంటి అనుభూతులన్నీ బ్లాగులో దాచుకోవడం, పదిమందితో పంచుకోవడం మంచి అనుభవం. రాధిక గారన్నట్టు, మీవాడు పెద్దయ్యాకా ఇవన్నీ చూపించి బహుమతిగా ఇవ్వడం మంచి ఆలోచన.

కే స రి said...

ఆహా... మీవాడి "వాడి" యార్కర్లకి బౌల్డ్ అయ్యిన మీరు భలే (జ)లక్కీ...!!

Kesari.!
http://palaka-balapam.blogspot.com/

'ఐ'స్మైల్! said...

మనోడు ఆ పచ్చని చెట్ల వలన గాలి వస్తుందనుకొన్నాడో, లేదా పంకా లాగా ఊహించేసుకొన్నాడో...ఏదేమైనా వాడి ఊహాశక్తి అమోఘం! ఇక పక్కింటి అమ్మాయిల విషయంలో ఇప్పటి నుంచే కాస్త జాగ్రత్తగా ఉండాలి మీరు:)

వికటకవి said...

పిల్లలు పిడుగులు అని ఊరికే అన్నారా? పిల్లలు ఎప్పుడైనా సరే మన మెదడుకి మేత పెట్టేవాళ్ళే! తప్పక భద్రపరుచుకోవాల్సిన విషయాలే ఇవన్నీనూ.

http://sreenyvas.wordpress.com

netizen said...

పులి కడుపున పులే పుడుతుంది కదా, వికటకవి గారు?

చదువరి said...

ఇక్కడే రాయండి. మీ పిడుక్కి బహూకరిద్దురు గాని!

S said...

అర్రె! ఈ ఐడియా బాగుందే...ఎవరైనా కొత్తగా పిల్లలు పుట్టిన వాళ్ళకి చెప్తాను.. :) hmm.. మంచి ఆలోచన...వాళ్ళకి పెద్దయ్యాక ఇవ్వడం :) మీ అబ్బాయి మహా తెలివి గలవాడు అండోయ్!

సిరి said...

అందరికి కృతజ్ఞతలు. కొన్నాళ్ళుగా పనిలో చాలా బిజీ!
@రాధిక - మా అబ్బాయి వయసు గురించి టపాలో ఇచ్చాను. మూడు సంవత్సరాలా నాలుగు నెలలు.
@'ఐ'స్మైల్ - ఇప్పుడున్న ముగ్గురమ్మాయిలు చాలరన్నట్లు, మరో ఇద్దరమ్మాయిలున్న ఫేమిలీ ఒకటి ఈ మధ్యనే మా ఇంటికి ఇటువైపున్న ఇంట్లో అద్దెకు దిగారు. ఇంకేమి చెప్పమంటారు ;-)