శ్రీశ్రీ పద్యాల్లో నాకు బాగా నచ్చిన వాటిలో బహు బాగా నచ్చిన పద్యాల్లో "శైశవ గీతి" ఒకటి!
నా పుత్రరత్నం అల్లరి, అన్ని దశలను, దిశలను దాటి...దిగంతాలకి విస్తరిస్తుండగా - వాడిని బ్రతిమలాడి, ప్రక్కన కూర్చో పెట్టుకుని
"శైశవ గీతి" వినిపిస్తుంటే - మా వాడు 'విభా ప్రభాతములు ', 'మంత్ర కవాటం', 'కంచు వృషభముల అగ్ని శ్వాసం ', 'స్వచ్ఛ కౌముదుల శరన్నిశీథినులూ, 'హిమానీ నిబిడ హేమంతములు ' విని ... అంటే... అంటే...అంటే...అని అడుగుతూంటే, వానికి సమాధానాలు చెబుతుండగా, ఒక సందేహమొచ్చింది!
'అయిదా రేడుల పాపల ' కోసం వ్రాసిన గీతంలో మహాశిల్పి అన్ని కష్టమైన పదాలనెందుకు ప్రయోగించాడా అని. పిల్లల గురించి పెద్ద వాళ్ళకోసం వ్రాసిన గీతం కాదు కదా ఇది. మహాకవి ఈ పద్యంలో పిల్లలను నేరుగా సంభోదిస్తాడు, చాలా చోట్ల!
ఇప్పటికి ఈ పద్యాన్ని ఎన్ని సార్లో చదివాను. కానీ ఎప్పుడూ నాకీ సందేహం రాలేదు.
మరొకరి(ఈ సందర్భంలో మా అబ్బాయి)దృష్టితో చూసినప్పుడు, ఆలోచించినప్పుడూ...మనం రోజూ చూసే వస్తువుల్లో, ఎదురయ్యే సంఘటనల్లో క్రొత్త క్రొత్త అంశాలు బయటపడతాయని మరొక సారి అనిపించింది.
Tuesday, October 23, 2007
Subscribe to:
Post Comments (Atom)


2 comments:
శైశవ గీతి - సిరాతో కాకుండా, అమృతంతో వ్రాయబడింది అని పిస్తుంది! అది వ్రాసిన కవి శ్రీశ్రీకే శ్రీశ్రీ!
ప్రత్యేకించి ఋతువులను పిల్లలకి అర్పించడం అమోఘం!
పిల్లల మీద వ్రాయబడినది కానీ పిల్లలకి అంతా మహా కవిత్వం ఎక్కడ అర్థమవుతుంది చెప్పండి?
మీ టపా చదివి ఇవ్వాళ్ళ పొద్దున ఆ గీతం మళ్ళీ చదివాను. ఐదారేడుల పాపల్లారా వంటి సంబోధనలు ఉన్నాయి నిజమే కానీ గీతంలో అంతస్సూత్రంగా ఉన్న గొంతుని వింటే అది కవి తనని తాను (తనలో దాక్కున్న, లేక మరుగు పడిపోయిన బాల్యాన్ని) సంబోధిస్తూ చెప్పిందని నాకు తోచింది. నాస్టాల్జియా కాదు, బాల్యాన్ని ఒక సత్యానికి ప్రతీకగా ఊహించారు అనిపించింది - నా భావనలు మాత్రమే. :-)
Post a Comment