Wednesday, May 23, 2007

మన తెలుగు కవిత్వానికి మళ్ళీ మంచి రోజులు రావాలి

సీసాలు, కందాలు అయినంత మాత్రాన కవితామయమైపోవు కదా, అన్నీ!
ఎక్కడో చడివిన ఈ క్రింది లైనులు చూడండి:

అప్పి కట్లకు బాపట్ల అయిదు మైళ్ళు (తేటగీతి ఛందస్సులో ఒడిగే పాదం).
ఆంధ్ర పత్రిక ఇచ్చట అమ్మబడును (మరో తేటగీతి పద్య పాదం).

గణాలు సరిగ్గా సరిపోయాయి. యతి స్థానం చక్కగా కుదిరింది. అర్తమున్న వాక్యమే అవతరించింది (నా దృష్ఠిలో అర్థమున్న వాక్యం).
కానీ అలా మూసలో అచ్చొత్తినంత మాత్రాన పదాలు కవిత్వపు స్థాయికెళతాయా?

ఒక అనుభవాన్నో, ఒక సత్యాన్నో - అనుభవించిన వాడు, శోధించిన వాడు... ఆ ఉద్విగ్న తరంగాలను తనలో దాచుకోలేక, పసి పాపలా కేరింతలు కొడుతూ, చుట్టూ వున్న వాళ్ళతో పంచుకోవాలనుకుని, అందుకు కవిత్వాన్ని వాహకంగా ఎంచుకుంటాడు.
చుట్టూ ఉన్న వాళ్ళలో కొందరు ఆ భావతరంగాలకనుగుణంగా స్పందిస్తారు. కొందరు 'ఇదేమి గొడవ' అంటూ ప్రక్కకు తప్పుకుంటారు. మరికొందరు 'నీ ఆవేశాన్ని అలాకాదు వ్యక్తంచేసేది. ఆ చేతుల్ని ఇంకాస్త పైకెత్తు. స్వరంలో గమకం పెంచు. కాళ్ళను ఇంకాస్త వొంచు. భoగిమ కొంచెం మార్చు...అద్గదీ...అలా వ్యక్తం చేయాలి' అంటూ సలహాలు మొదలెడతారు.

అలా అనుభవాన్ని ఇలా మాత్రమే, ఈ పరిధుల్లోనే, ఈ సూత్రాలకు లోబడే అభివ్యక్తీకరించాలి అని శాసించడం అంత సబబు కాదు అనిపిస్తుంది నాకు. కానీ, అర్హత గల వాళ్ళు - పదాల సమూహం కళ స్థాయిని అందుకునేందుకు ఉపయోగపడే సలహాలివ్వడం వల్ల కవికి కవిత్వానికి మేలు జరుగుతుందని నా నమ్మకం.

కట్టుబాటులను కాదనక, సంప్రదాయానికి తల ఒగ్గి అందరూ వ్రాసి ఉంటే మనకొక గురజాడ, శ్రీశ్రీ, తిలక్, ఇస్మాయిల్, అజంతా, మో లాంటి కవులు ఇప్పుడున్న రూపాల్లో దొరికేవారా? సందేహమే!

ఇకపోతే - నినాదాలు, పేలవమైన నిర్మాణాలు, స్పష్టత లేక పోవడం (క్లిష్టత కాదు!) ఈ మధ్య వొస్తున్న కవిత్వంలో కొట్టొచ్చినట్లు కనిపించే లోపాలు(కొన్నింటికి మినహాయింపులు ఉండొచ్చు).
ఒక భావం/అనుభూతి కవితగా రూపం పోసుకుని - పాఠకుడిలో/శ్రోతలో రస స్పందన కలగజేస్తే (కవి అనుభవించిన స్థాయిలో కాకున్నా సరే)-ఆ రచన కవిత్వంగాను, కళ గాను మారినట్లేనని నేననుకుంటాను.

పద్యాల బాటన నడుస్తున్న కవితా రధాన్ని, మాత్రా ఛందస్సుల గేయ మార్గంలోకి...అక్కణ్ణుంచీ వచనంలోకీ మళ్ళించి ఎందరి మెప్పునో పొందిన మన ప్రియతమ కవులే, ఈ నాటి కవిత్వ స్థితికి పరోక్షంగా కారకులేమోనని పిస్తుంది!

అన్ని రోజులూ ఒకేలా వుండవు కదా! మన తెలుగు కవిత్వానికీ మళ్ళీ మంచి రోజులు వస్తాయని ఆశ!

Tuesday, May 22, 2007

ఉద్యోగ పర్వం మధ్యలో

ఏ ఉద్యోగంలోనూ శాటిస్ ఫాక్షన్ ఉండడంలేదు. రెండేళ్ళలో నాలుగు ఉద్యోగాలు మారా! అయినా పరిస్థితిలో మార్పులేదు! ఎక్కడ వేసిన గొంగళి అక్కడే!
చదివిన చదువుకు చేస్తున్న ఉద్యోగానికి సంబంధంలేదు. ఇండియాలో ఉపాధి కరవైన వేళ, అమెరికాలో జాబనగానే ఎగిరి గంతేసి వచ్చింది నేనే! మొదటి అయిదేళ్ళు ఆలోచించే తీరిక లేకుండా, అంతా ఆహా ఓహో అన్నట్లు గడిచింది. అక్కణ్ణుంచి ఎన్నాళ్ళిలా అంటూ మొదలై...ఉందిలే మంచి కాలం ముందు ముందునా అనుకుంటూ మరో రెండేళ్ళు, ఇంకా ఒకే కంపెనీలో కూర్చుంటే లాభం లేదని వేట మొడలెట్టా.
కంపెనీ మారినా, టైటిల్ మారినా ... మనిషి మారలేదు, ఆటని ... అన్నట్లు చేసే పని పెద్దగా మారలేదు.
మళ్ళీ వెదుకులాట, మరో కొలువు! మరో కొలువు...మరో కొలువు!
ఉదయం మా పక్కింటావిడ కనిపించి...మళ్ళీ ఉద్యోగం మారావటగా కంగ్రాట్సని వూరుకోకుండా, నీకు వెంట వెంటనే భలే ఉద్యోగాలు దొరుకుతున్నాయే అని ఆశ్చర్య పోయింది. ఇల్లు కాలి ఒకడేడుస్తుంటే అన్న సామెత గుర్తొచ్చింది.
పై మెట్టు ఎక్కే స్కిల్స్, అనుభవం ఉన్నా, అవకాశపు నిచ్చెన అగుపించడంలేదు.
ఇదే మాట ఒక ఫ్రెండ్ తో అంటే, నువ్వు కుదురుగా ఒక చోట పనిచేస్తేగా ఎగప్రాకే అవకాశమొచ్చేది అన్నాడు! ఇంకెవరైనా ఆ మాట చెబితే, నిజమో కాదో కాస్తన్నా ఆలోచించే వాణ్ణి! మిత్రుడు, ఎనిమిదేళ్ళుగా ఒకే కంపెనీలో...మారని జాబ్ టైటిల్ తో పని చేస్తూ ఉన్నాడు.
అలా అని నా స్కిల్స్ లోనో, నా ప్రయత్నాల్లోనో లోపం లేదని కాదు! ఉంటే ఉండొచ్చు అని ఆలోచిస్తూ పోతే, నా కేమి కావాలో నేనే ఇథమిద్దంగా తెలుసుకోక పోవడం ప్రధాన ప్రతిబంధకంగా కనిపించింది, మిగిలిన లోపాలు ఒకటీ అరా ఉన్నా!

ఫ్రెండ్స్ తో మాట్లాడేటప్పుడు, నేనున్న పరిస్థితుల్లో ఇంకా కొందరున్నారనిపించింది.
ఈ సమస్యకు పరిష్కారం - ఇండియా వెళ్ళి అక్కడ ఉద్యోగం వెదుక్కోవడమేనని కొందరి అభిప్రాయం! అదెంత వరకు ఉపయోగిస్తుందీ అని ప్రస్తుతపు నా ఆలోచన!