Saturday, June 30, 2007

కార్తికేయన్ అకాల మరణం

ఎంతటి విషాదం!
అతడెవరో తెలీదు నాకు. అయినా ఈ వార్త చదువుతుంటే గుండె కలచి వేసింది. ఇరవై ఏడేళ్ళ ప్రాయంలో అకాల మరణం పాలైన 'కార్తికేయన్ 'ను, ఆయన తల్లి తండ్రులను తల్చుకుంటే చాలా బాధేస్తోంది!
వైద్య రంగంలో మానవ సేవకు కృషి చేస్తూ అసువులు బాసిన కార్తికేయన్ ఆత్మకు శాంతి చేకూరాలని మనసారా ప్రార్ధిస్తున్నాను.
వారి కుటుంబానికిది తీరని విషాదం. తోటి మనుషుల తోడు, మాట బాసట వారికి చాలా అవసరం.
పోయిన కొడుకును ఎలాగూ తిరిగి రాడు...ఎవరమూ రప్పించలేము. నా సానుభూతి వారికి కావలసిన స్వాంతన చేకూర్చలేదని తెలిసినా...కార్తికేయన్ కుటుంబ సభ్యులకు, మిత్రులకు నా ప్రగాఢ సంతాపం.

http://www.andhrajyothy.com/mainshow.asp?qry=/2007/jun/29main50

Friday, June 29, 2007

నేడే విడుదల - iPhone (ఐ ఫోన్)

యాపిల్ కంపెనీ వాళ్ళు ఐఫోన్ విడుదల చేస్తున్నామని ప్రకటించినప్పటి నుంచీ, అదెప్పుడెప్పుడొస్తుందా అని,ఎదురు చూస్తున్న వాళ్ళలో నేనూ ఒకణ్ణి! పరీక్షలు వ్రాసాక ఫలితాల కోసం కూడా ఎన్నడూ ఇంతలా ఎదురు చూసిన జ్ఞాపకం లేదు!అంత ఎదురు చూపులెందుకంటే - 1) ఆ ఫోన్ చాలా నచ్చింది. బొత్తాలు (buttons) వుండవు. ఫోటోలు, వీడియోలు చూడొచ్చు...తీయొచ్చు. పాటలు వినొచ్చు, ఎవరైనా చక్కగా పాడుతుంటే రికార్డ్ చేసుకోవొచ్చు. 2) నా పాత మోడల్ నోకియా ఫోనుకు, ఐపోడ్ కు ఇక రిటైర్మెంట్ ఇచ్చేసెయ్యొచ్చు. 3) యాపిల్ వాళ్ళు ఏ ప్రోడక్టునైనా అందంగా, నాణ్యంగా చేస్తారన్న నమ్మికం. నమ్మకాన్ని నిలబెట్టే వాళ్ళ అమ్మకాలు పెంచాలి కదా! 4) పెరుగుతున్న యాపిల్ కంపెనీ స్టాకులు.
దాదాపు 200,000 ఫోనులు మొదటి రెండు రోజుల్లో అమ్ముడవుతాయని అంచనా అట! కొన్ని చోట్ల ఇప్పటికే షాపుల ముందు ఔత్సాహికులు వరసల్లో నిలబడ్డారని వ్రాసింది ఒక పత్రిక (http://www.businessweek.com/ap/financialnews/D8Q2527O1.htm )!
ఐఫోన్ ఈ రోజు సాయంత్రం ఆరు గంటలకు వచ్చేస్తోంది మార్కెట్ లోకి!సాయంత్రం షాపు కెళితే, నాకొకటి దొరుకుతుందో లేదో!!

Thursday, June 28, 2007

కేసులు ఏమవుతాయి?

'పవన్ కళ్యాణ్ మీద కేసు ఏమవుతుందనుకుంటున్నారు?' అనడిగారొక పెద్దాయన!
అమాయకత్వానికి హద్దులుండవా అనిపించింది, ఆయన వాలకం చూసి.

ముఖ్యమంత్రి గారి మీద పాల్ కేసు పెట్టారు. అదేమౌతుంది? (అసలక్కడ కేసే లేదన్నది వేరే సంగతి!)
మార్గదర్శి మీద కొన్ని నెలల క్రితం పెద్ద దుమారం లేచింది. ఇంకేముందు కొండ కుదేలవుతుందన్నారు...చివరకు ఏమైంది? అలాగే బాలకృష్ణ గారి మీది షూటింగ్ (సినిమా షూటింగ్ కాదని మనవి!) కేసూ ఒక వారం రోజులు మాంచి యాక్షన్ కాలక్షేపాన్నిచ్చి, సాక్ష్యాలు లేక తుస్సుమనలేదూ?!

'పవన్ కళ్యాణ్ కేసు ఏమవుతుందో వేరుగా చెప్పాలా?' అని ఎదురు ప్రశ్న వేశా. ఏమవుతుందో తెలియదని ఒప్పుకోలేక!
సెలబ్రిటీలను చూస్తే అందరికీ లోకువే! అయిన దానికీ కాని దానికి కేసులు పెట్టి హడావిడి చేస్తుంటారు. టీవీలు, సినిమాలు చూసి చూసి విసుగెత్తుతున్న సమయంలో...ఇలాంటి ఎపిసోడులు లేక పోతే జనమేమైపోతారో!

'ఈ కేసు నేపధ్యంలో, చిరంజీవి భవిష్యత్తులో రాజకీయాల్లోకి రావొచ్చుననుకుంటున్నారట కదా?' అడిగారా పెద్దాయన మళ్ళీ.
'అబ్బే చిరంజీవి గారింకా ఆ విషయం నాతో చెప్పలేదండీ' అంటూండగానే, నన్ను రక్షించడానికి నా సెల్ ఫోన్ మ్రోగింది.
ఫోన్ చేసింది చిరంజీవి గారు కాదు!

Wednesday, June 27, 2007

ఒంటరి

అల్లంత దూరంలో
వంతెన
వరదలో
కొట్టుకు పోయింది

తెగిన తీగల
వలయాలు
కాళ్ళను చుట్టేసాయి

కట్టెల్ని
లాక్కెళుతూ
చుట్టూ నీళ్ళే!

అయినా గొంతెండి పోతోంది దాహంతో

Wednesday, June 20, 2007

ఆకాశంలో చంద్రుడు శుక్రుడు దగ్గర దగ్గరగా

నాకు ఖగోళ శాస్త్రమంటే చాలా ఆసక్తి. వారానికి కనీసం రెండు మూడు గంటలు, ఇంటర్నెట్లో ఈ శాస్త్రానికి సంబంధించిన సమాచారం చూస్తుంటాను.
మొన్న చంద్రుడు శుక్రుడు దగ్గర దగ్గర కూర్చుని కబుర్లాడుకుంటూ వెలిగిపోవడం చూసి చాలా ఆనందించా!
ఇవ్వాళ చూస్తే ఇద్దరూ దేదీప్యమానంగా ప్రకాశిస్తున్నారు గానీ, ఒకరికొకరు దూరంగా ఉన్నారు. మీకూ కుదిరితే రేపొకసారి చీకటి పడగానే, ఆరు బయటకొచ్చి ఆకాశంలోకి ఒక లుక్కేయండి. చందమామకు కాస్త దగ్గరలో శుక్రుడు కనిపిస్తాడు ( చందమామ శుక్రుణ్ణి కప్పేసేది కూడా రేపే అనుకుంటా).
వాళ్ళను చూస్తూ చుట్టు పక్కల గమనిస్తే - సప్తర్షి మండలం కనిపించింది. ఎందుకో ఇండియాలో, మా వూళ్ళో కనిపించినంత ప్రకాశవంతంగా లేరు సప్తర్షులు! అరుంధతి అస్సలు కనిపించలేదు!
ఇంకో విషయం, మా వూర్లో నేను చూసిన ప్రతి సారి - ఉత్తరం వైపు, క్షితిజ రేఖకు కాస్త పైన కనిపించిన ఋషులు - బే యేరియాలో (కాలిఫోర్నియాలో) నడి నెత్తిమీద కనిపించారు!
సునీత విలియంస్ అట్లాంటిస్‌లో ఈ పాటికే బయలుదేరింది భువికి. క్షేమంగా అట్లాంటిస్ అందులోని వ్యోమగాములు భూమ్మీదకు రావాలని కోరుకుందాం!

Saturday, June 16, 2007

మళ్ళీ సిరివెన్నెల గారి ఇంటర్వ్యూ మీద

This post has been deleted.

Thursday, June 14, 2007

మాఫియా...మాఫియా...!

ఇదంతా ఒక పెద్ద మాఫియా వ్యవహారం లాగుంది!

మొన్న ఒక కాంట్రాక్టరు జాబుకు అప్ప్లై చేసా. నా స్కిల్స్, అనుభవం సరిగ్గా సరిపోతాయా ఉద్యోగానికి! రిక్రూటర్ కాల్ చేసింది. నీ రెసుమేలో సప్లై చైన్ మేనేజ్మెంట్ లో పనిచేసినట్లు కనిపించడం లేదే అంది. నీ కళ్ళు కాళ్ళలో ఉంటే ఎలా కనబడుతుంది - అనుకుని, యెస్ సి ఎం అంటే అదేనమ్మా అని చెప్పా! అలాగా అనిపించడం లేదు. నువ్వు సప్లై చైన్ మేనేజ్మెంట్ లో ఎన్నాళ్ళు పని చేసేవో మళ్ళీ రాసి పంపు అన్నది.

ఫోన్లో సరే అన్నా. రెసుమే మాత్రం మార్చి పంపలేదు.

నాకెప్పుడూ ఒక అనుమానం. ఒక్క మన దేశీ రిక్రూటర్లే ఇలా ఉంటారా...మిగిలిన వాళ్ళు కూడా ఇదే టైపా అని! అదే ఒక ఫ్రెండుతో అంటే - రిక్రూటింగ్ ని మన వాళ్ళు కుటీర పరిశ్రమ క్రింద మార్చేసారు. ఇంట్లో ఖాళీగా ఉండే 'ఇంటి భార్యలు (House Wives)' ఇలాంటి అఘాయిత్యాలు చేస్తుంటారని చెప్పాడు.నాకు తగిలిన ఇలాంటి దేశీ రిక్రూటర్లలో మగ వాళ్ళు కూడా ఉన్నారు!

మరో ఏడెనిమిది సైటుల్లో నా స్కిల్స్ కు, అనుభవానికి సరిగ్గా సరిపోయే ఉద్యోగం కనిపించింది. వాటిలో దేశీ కంపెనీగా అనిపించని రెండు కంపెనీలకు అప్లై చేసా. నిజానికి ఒకటే ఉద్యోగం ఉండి ఉంటుంది. వేరు వేరు స్టాఫింగ్ కంపెనీల వాళ్ళు advertise చేస్తున్నారు.

రెండు కంపెనీల్లో ఒక కంపెనీ వాళ్ళు ఫోను చేసారు. పేరు మార్క్...శుద్ధమైన పశ్చిమ గోదావరి తెలుగు యాసలో అమెరికన్ యాక్సెంటును కలపాలని విఫలయత్నం చేస్తూ సంభాషణ మొదలెట్టి ... కుశల ప్రశ్నలయ్యాక 'గంటకెంత? ' అడిగాడు. ప్రశ్న ఎందుకో నచ్చలేదు! ఏదో గుర్తొచ్చింది!!'ఎంత వరకు ఇవ్వగలరు?' అడిగేను, ఇంగ్లీషును తెలుగులో మాటాడుతూ!అవతల నుంచీ 'యాభై''నూట యాభై?' సరిగ్గా నాకు వినిపించలేదేమోనని అనుమానమొచ్చి అడిగా!'అవును.. యాభై...ఫైవ్ జీరో' అన్నాడు.సెల్లు ఫోనులతో ఇదొక చిక్కు!'చాలా తక్కువ ''మాకు డైరెక్టు క్లైంటు కాదు. మూడు లేయర్లున్నాయి 'చెప్పాడు. మంచి రేటొచ్చే ప్రాజెక్టు దొరికితే పిలుస్తానన్నాడు.ఎంత మందిని చూడలేదూ అనుకున్నా!

క్లైంటిచ్చే 100 - 125 లో పని చేసేవాడికి దొరికేది యాభై!

మర్నాడు మరో కంపెనీ బాబు కాల్ చేసాడు. వీడూ తెలుగే! కాకపోతే ఏ ప్రాంతమో తెలియలేదు. పేరు మాత్రం 'Jonathan శాస్త్రి ' అని చెప్పాడు!

క్లైంటుతో ఇంటర్వ్యూ పెట్టిస్తానన్నాడు. పెట్టించాడు.

ఇంటర్వ్యూ అయి పోయాక బయటకు వస్తుంటే, పార్కింగ్ లాట్‌లో, ఒక చెట్టు క్రింద శాం కనిపించాడు. నాకు శాం చాలా కాలంగా తెలుసు. కొన్నేళ్ళు ఇద్దరం కలిసి పనిచేసాం కూడా!

ఇంటర్వ్యూ సంగతి తెలుసుకుని, ఏ కంపెనీ వాళ్ళ ద్వారా అనడిగాడు.చెప్పేక ... ముందు తెలిసుంటే నిన్ను భలే గైడ్ చేసుండే వాణ్ణే...అని ఒక నిమిషం బాధ పడి 'ఈ ఉజ్జోగం నీకు రావడం చాలా కష్టం...ఇక్కడ పోలిటిక్స్ బహు మెండూ అన్నాడు.'అలాగా' అన్నా! ఏదో అన్ని రంగాల్లోకి చొచ్చుకు పోయింది కంప్యూటరూ ఇంటర్నెట్టూ అంటారు గానీ, నాకైతే పోలిటిక్స్‌లేని ఫీల్డే లేదని పిస్తుంది.'నేను చెప్పానని ఎవరితో అనకు... హైరింగ్ మేనేజర్‌కూ, నిన్ను పంపిన కంపెనీకీ పడదు. ఫలానా ముడుపుల కంపెనీనుంచే వాడు హైర్ చేస్తాడు ' చెప్పాడు.'అలాంటప్పుడు నన్నెందుకు పిలిచినట్లు ' అన్నా.'పక్క మేనేజర్లకు అనుమానం రాకుందా ' అని నవ్వి 'ఇంకా అర్థం కాలేదా... వివరంగా చెప్పనా ' అన్నాడు.
అసలే చెట్టు క్రింద ఉన్న సంగతి మర్చి పోయి, నిలువుగా తలూపాను.

'ముడుపుల కంపెనీ వాడికి ముడుపులు ఇస్తుంది, గంటకు ఇంతని ' అన్నాడు.

'మరి అకౌంటులూ...టాక్సులూ...అయ్యారెస్‌లూ...' అంటూ నా సందేహాల లిస్టు తీసా. చెవులు కనిపిస్తే, పువ్వులు పెట్టే రకమని శాం కి పేరు. వీడు చెప్పే వాటిలో వాస్తవమెంత ఉంటుందో కనుక్కోవడం కాస్త కష్టమైన పనే!

'నువ్వు ఇంకా ఎదగలేదోయ్ హోలు మొత్తంగా చెబుతా విను ' అంటూ ఇలా చెప్పుకు పోయాడు.
కంపెనీ గంటకు వంద ఇస్తుందనుకుందాం. మేనేజరు ఒక పది నొక్కుతాడు. లీడొక అయిదు...ఒక్కోసారి ఇంటర్వ్యూ చేసి ఓకే చేసే వాళ్ళు ... వీళ్ళు సాధారణంగా లీడు క్రింద పని చేసే వాళ్ళై ఉంటారు...అయిదు డాలర్లను సమానంగా పంచుకుంటారు. ఆవిధంగా బడ్జెటయిపోయే వరకు ప్రాజెక్టు సాగుతుంది. డబ్బెలా ఇస్తారు - అనేగా నీ ప్రశ్న - పర్సనల్ చెక్కుల రూపంలో - ఇండియాలో ఉండే బంధువుల పేరుల మీద, స్నేహితుల పేరుల మీద - వేరు వేరు చెక్కులను చిన్న చిన్న మొత్తాలుగా విడగొట్టి ఇస్తారు. మేనేజర్ ఇండియన్ కాకపోతే, ఈ పంపకాలన్నీ ఎలా జరుగుతాయో నాకూ పూర్తిగా తెలియదు...బహుశా బహుమతుల రూపంలో ఉంటాయేమో అని ఆపాడు.

ఇదంతా వినేసరికి నాకు మాఫియా గాంగుల గురించి అక్కడక్కడా చదివింది గుర్తొచ్చింది...కాంట్రాక్ట్ జాబ్స్ వెనక ఇన్ని కాంట్రాక్టులుంటాయా అని!

'నువ్వొక పని చెయ్యి. నీ అప్‌డేటెడ్ రెసుమేని నాకు పంపు. మనకు తెలిసిన వాళ్ళ ద్వారా వర్కవుట్ చేద్దాం. నాకు మాత్రం ఆరో ఏడో ఇవ్వు గంటకు 'అన్నాడు శాం ముక్తాయింపుగా!

***** ఇదంతా కల్పన కాదు. అలాగని వంద శాతం వాస్తవం కాదు. ఇక్కడి ఉద్దేశ్యం హైరింగ్ మేనేజర్లు అందరూ డబ్బులు తీసుకునే వాళ్ళని చెప్పడం ఎంత మాత్రమూ కాదు. *****

Saturday, June 9, 2007

సుధా మూర్తి 'అమ్మమ్మ చదువు' కథల పుస్తకం - ఒక సమీక్ష

ప్రతి గురువారం న్యూయార్కర్ మాగజీన్ వస్తుంది పోస్టులో! దాని మొహమోసారి చూసి, హాల్లో ఒకట్రెండు రోజులు, ఆఫీసు రూములో రెండ్రోజులు - అక్కణ్ణుంచీ బెడ్ రూములో మంచం పక్కన బల్లమీద మరో రెండ్రోజులుంచి - 'చెత్త రోజున' (Trash day) గరాజ్లో ఒక పక్కన్న, దొంతరగా పేరుకుపోయిన మిగిలిన సంచికల సరసన చేరుస్తాను. మర్నాడు క్రొత్త సంచిక రాక...వారంలో గరాజ్లోకి పోక...అతి మామూలుగా!

ఇంతా తెలిసి కూడా subscription ఆపేద్దామా అంటే మనసొప్పదు. ఏదో రకంగా తీరిక చేసుకుని చదివేయ్యొచ్చన్న ఆత్మ విశ్వాసం!

ఇక చదవలేక పోవడానికి నాకు నేను చెప్పుకునే కారణం టైము లేక పోవడం...ఎలా వుంటుంది, సెల్లులో ఉచిత నిమిషాల టైములో కనీసం గంట మాటలు, టీవీ తో రెండు మూడు గంటలు...కంప్యూటర్తో రెండు గంటలు(పని నుంచీ ఇంటికొచ్చాక)! టీవీలు, కంప్యూటర్లు, ఫోనులు(అందుబాటులో) లేని కాలంలో జనం ఏమి చేసేవారు? బహుశా న్యూయార్కర్ లాంటి పత్రికలను, పుస్తకాలను చదివేవారేమో!

నేనూ కొన్నాళ్ళు టీవీ మానేసి, పుస్తకాలు చదువుదామనుకున్నా. గరాజ్లోకి వెళ్ళడానికి బద్దక మేసి, పుస్తకాల షెల్ఫ్ లో నేను మూడేళ్ళ క్రితం ఇండియా వెళ్ళినప్పుడు తెచ్చుకున్న పుస్తకాల్లోంచీ ఒక చిన్న సైజు పుస్తకాన్ని అందుకుని, దానికి అంటుకున్న దుమ్ము దులిపి, చదవడం మొదలెట్టాను!

ఆ పుస్తకం పేరు 'అమ్మమ్మ చదువు'! కథల పుస్తకం. ఆంగ్లం నుంచీ అనువదించబడింది. వ్రాసింది సుధామూర్తి!! తెలుగులోకి అనువదించింది 'ద్వారక'.

ముందుమాటలో - టీవీలు లేని కాలంలో పల్లెటూళ్ళో పుట్టి, ఇంట్లో పుస్తకాలనే మనోరంజక వస్తువులుగా భావించానని సుధామూర్తి గారంటారు! ఈ పుస్తకంలోని కథలన్నీ రచయిత్రి స్వీయ అనుభవాలే(ననిపిస్తుంది)!
మొదటి కథ 'అమ్మమ్మ చదువు'. మనవరాలితో కథలు చదివించుకునే, చదువు రాని అమ్మమ్మ కథ ఇది. ఆ రోజుల్లో కన్నడ రచయిత్రి త్రివేణి వ్రాసే సీరియల్ నవల భాగాన్ని, మనవరాలు పొరుగూరు పెళ్ళికి వెళ్ళిన కారణంగా చదవలేక పోయినందుకు బాధపడ్ద అమ్మమ్మ - మనవరాలి దగ్గర చదువు నేర్చుకోవడం గురించిన కథ! స్వతంత్రత కోసం శ్రమించడానికి, వయసు అడ్డంకి కాదని, చిన్న వాళ్ళ దగ్గరైనా తెలియని విషయాలు నేర్చుకోవడంలో నామోషీ పడరాదని తెలియ జెప్పే కథ ఇది. చదువుకు, అమ్మమ్మ కే కాదు...ఈ కథను చాలా రకాలుగా అన్వయించుకోవచ్చునని పించింది. Inspirational story!

రెండో కథ సుభూషణం - అక్షరాస్యతను పెంచడానికి అమ్మ ప్రోద్బలంతో స్కూళ్ళు నిర్మించి నడిపే ఒక కొడుకు కథ. సమాజం నుంచీ సంపాదించిన డబ్బులో కొంతైనా సమాజానికి ఖర్చు పెట్టడం, అభివృద్ధికి కృషి చేయడం. ఇదే సందేశం అప్రో జె.ఆర్.డీ. కథలో కూడా కనిపిస్తుంది. అప్రో జె.ఆర్.డీ. కథలో సుధామూర్తి గారి సాహసకృత్యం గురించి కూడా తెలుసుకోవొచ్చు!

కథలు చదివేటప్పుడు, కథలో కథాంగాల సమన్వయం ఎలా వుందీ, కథ సమష్టి రూపం ఎలా ఉందీ అని అలోచించే నాకు - చిత్రంగా ఈ కథల్లోని కథాంగాల గురించి ఆలోచించి పరిశీలించే వ్యవధి దొరకలేదు! నిజ జీవిత కథలు కావడం వల్లనేమో, ఆసక్తిగా ఒక కథ తర్వాత మరొకటి చదువుకుంటూ పోయాను.

ఈ పుస్తకంలోని ఎనభై శాతం కథలు నాకు నచ్చాయి. నచ్చిన వాటన్నింటి గురించి ముచ్చటించడం కంటే - బాగా నచ్చిన వాటి గురించి వ్రాస్తే, మీ సమయం నా సమయం ఇక్కడ ఆదా అవుతాయి కదా!

'హోరెగల్లు' అనే కథ బాగా నచ్చిన వాటిలో ఒకటి. ఈ కథలో ఎదుటి వారి బాధల్ని ఓపిగ్గా సానుభూతితో వినడమనేది గొప్ప సమాజ సేవ అంటుంది రచయిత్రి. నిజమే కదూ!

నన్ను బాగా ఆకర్షించిన మరో కథ - ఎర్ర బియ్యం. ప్రకృతి ప్రళయాలొచ్చినప్పుడు, నిస్సహాయులను ఆదుకోడానికి ఇచ్చే విరాళాలు...బాధితులకు ఉపయోగపడేలా ఉండాలని చెప్పే కథ. ఏదో మనకి అస్సలు పనికి రావు అనుకున్న బట్టలను, వస్తువులను విరాళం పేరుతో మరొకరికిస్తే అవి వాళ్ళకూ ఉపయోగపడవు కదా! ఇళ్ళలోని చెత్తను వదిలించుకోవడానికి విరాళాల వంక చూపడం ఎంత అన్యాయం?!

సుధామూర్థి గారి ఉపాధ్యాయ వృత్తిలో, తారసపడిన తన స్టూడెంట్స్ గురించిన కథలూ కొన్ని ఆసక్తి కరంగా ఉన్నాయి. మూడు నాలుగు పేజీలు మించని 35 పదునైన కథలు!

పుస్తకం అట్ట వెనక 'చదువు లక్ష్యం శీల నిర్మాణం' అన్న ప్రాథమిక సూత్రానికి నిర్వచనం ఈ కథలు అని వ్రాసారు. చాలా కథల్లో అంతర్లీనంగా ఉన్న సూత్రమదే!

రచయిత్రి భర్త Infosys Founder నారాయణమూర్తి గారు. వారి గురించిన కథలు కూడా ఈ పుస్తకంలో ఉన్నాయి. చాలా ఆసక్తికరంగా, ప్రేరణ కలిగించేవిగా ఉన్నాయి.

ఇంగ్లీషులో పుస్తకం పేరు 'How I Taught My Grand Mother To Read And Other Stories'.

అనువాదం ఇంకా బాగుండవచ్చనిపించింది.

Friday, June 8, 2007

'సిరివెన్నెల' ఇంటర్వ్యూ - తగ్గిన నా అభిమానం!!!

'సిరివెన్నెల' సితార కిచ్చిన ఇంటర్వ్యూ లింక్ కు పెట్టిన టైటిల్ చూసినప్పుడు, సిరివెన్నెల మీద అంతకు ముందున్న గౌరవంలో సగ పాలు పోయింది.

Interview link: http://www.koumudi.net/General/sirivennela_interview.html

డేరీంగ్ అండ్ డాషింగ్ ఏమిటి మన ఖర్మ కాకపోతే!
సీతారామశాస్త్రి చెప్పిన విషయాల్లో ఎక్కువ భాగం ఆయన అహంకారం(ఆవేదన అనిపించలేదు, ఎంత ఆలోచించినా!), స్వోత్కర్ష తప్పించి మరేమీ కనిపించలేదు.
సిరివెన్నెల గారు పాట రాస్తే అర్థం కాలేదంటున్నారట నిర్మాతలు(?)
ఇంటర్వ్యూ అంతా చదివేక - పాటల కవిగా సినిమా ఫీల్డ్ లో డిమాండ్ తగ్గిపోయినప్పుడు(లేక తగ్గి పోతోందనుకున్నప్పుడు) , మాట్లాడిన మాటల్లా అనిపించాయి.

సిరివెన్నెల మంచి పాటలు వ్రాసాడు...వ్రాయగలడు కూడా! కానీ ఇప్పుడు ఆయనతో పాటలు రాయించుకోవడానికి నిర్మాతలూ, దర్శకులూ ముందూ వెనక ఆలోచిస్తున్నారంటే, లోపం నిర్మాతల్లో/దర్శకుల్లో ఎంత ఉంటుందో, సీతారామశాస్త్రిలో కూడా అంతే ఉంటుందనిపిస్తోంది! అన్ని పాటలు తనకిస్తేనే వ్రాస్తాననడం కూదా దారుణమే!
డబ్బు పెట్టేది నిర్మాత...సినిమాను తెర కెక్కించేది దర్శకుడు. వాళ్ళ అభిరుచుల మీరకే కవి పాటలు వ్రాయాలన్నది, ఇంత అనుభవమున్న సిరివెన్నెలకు తెలియదని నేననుకోను! అలాగే అవిటివాడు, ఎవరెస్టు శిఖరం ఎత్తు సామ్యం కూడా అంతగా నప్పలేదు!
అంతగా ఇతరుల భావాలతో రాజీ పడలేక పోయినప్పుడు - బయటకొచ్చి స్వతంత్రంగా ప్రతిభను నిరూపించుకోవాలి. పరిశ్రమ ఇచ్చే డబ్బూ కీర్తీ కావాలి... పెట్టుబడి పెట్టే నిర్మాత ఏ వల్లకాట్లో కలిస్తేనేం...నాక్కావలసిన స్వతంత్రం ఇవ్వాలి - అన్నట్టుంది!
ఆద్యంతం, సిరివెన్నెల గారేదో ఒక మహోన్నతమైన దిబ్బ మీద కూర్చుండి, మిగిలిన జనమంతా (మనతో సహా) నేల మీద మరగుజ్జులై పాకుతూంటే, జాలిగా చూసి 'ప్రైవేటు' చెప్పినట్లుంది!
ఇంకో నలభై శాతం గౌరవం తగ్గిపోయింది, సిరివెన్నెల మీద!!!

సిరివెన్నెల అభిమానులూ: నేనూ సిరివెన్నెల అభిమానినే! కానీ ఈ ఇంటర్వ్యూ చదివాక, "నా వ్యక్తిగత అభిప్రాయాలు" మాత్రమే ఇవి! నామీద మీరంతా యుద్దం ప్రకటించినంత మాత్రాన నా అభిప్రాయాలు మారవు!!

- సిరి

Thursday, June 7, 2007

భయమేస్తోంది!

మా పెద్దమ్మకు వంట్లో బాగోలేదని తెలిసింది.

ఇప్పుడామెకు అరవయ్యారేఏళ్ళు. పిల్లల్లేరు. ఆమె భర్త చాలా యేళ్ళ క్రితమే పోయాడు.
నా చిన్నతనంలో ఆమెను చూడ్డానికెళ్ళినప్పుడు జరిగిన ఒక సంఘటన గుర్తొస్తోందిప్పుడు.

చుట్టపు చూపుగా, అమ్మతో కలిసి, పెద్దమ్మ వాళ్ళ వూరు వెళ్ళాను. అప్పట్లో ఆమెకు రెండు గేదెలుండేవి. అక్కడా ఇక్కడా కూలి పనులతో బండి నెట్టుకు వచ్చేది.

మేము వెళ్ళేసరికి, వసారాలో గుంజ కానుకుని కూచుని, ఇంటి ముందు వేప చెట్టుకు కట్టేసిన గేదెను చూస్తోంది.నేనంటే ఎంతో ఆపేక్ష ఆమెకు. అయినా మా రాకకు ఎప్పటిలా ఆమె సంతోషించినట్లు కనిపించలేదు.

పలకరింపులయ్యాక, తెలిసిందేమంటే - గేదెకు వొంట్లో బాగోలేదని, అందుకే పెద్దమ్మ బాధ పడుతోందనీ!

ఆ వూళ్ళో పశువుల డాక్టరున్న గుర్తు కూడా లేదు నాకు.మనుషులకు సుస్తీ చేస్తే, మాత్ర లేసుకుంటే తగ్గి పోతుందనుకుంటాం. మరీ దగ్గర వాళ్ళైతే కాస్త ఊరడిస్తాం. పెద్ద జబ్బైతే మనం బాధపడుతూ, జబ్బున పడ్డ వాళ్ళను ఓదారుస్తాం! అంతే కానీ, ఇలా జంతువులకు జబ్బు చేస్తే, పెద్ద వాళ్ళెవరూ బాధ పడగా నేనప్పటికి చూళ్ళేదు(నా వయసప్పుడు పదమూడో పద్నాలుగో). అందుకే నేను చాలా ఆశ్చర్య పోయా. పైపెచ్చు, నన్ను చూడగానే నవ్వుతూ వచ్చి, నా బుగ్గ మీద ఒక ముద్దెట్టి - తింటానికి శనగ పప్పు ఉండలో, నూగు జీడీలో ఇచ్చే పెద్దమ్మ అలా పట్టీ పట్టనట్లు ఊరుకునేసరికి, నాక్కాస్త కోపమొచ్చిన గుర్తు!

'దానికేమీ కాదులేవే, రేపొద్దుటికి మామూలైపోతుంది' అని ఊరడించబోయింది అమ్మ!

దిష్టి తగలకుండా, గాలీ ధూళీ సోకకుండా - తాయొత్తు, వెంట్రుకలతో పేనిన మంత్రించిన తాడు గేదె కాలికి కట్టించారు. గేదె కూడా పడుకుని, పుసులు కట్టిన కళ్ళతో మగతగా, దీనంగా చూస్తోంది! నాక్కూడా ఒక్క క్షణం జాలేసినట్లు గుర్తు! మన భాష మాట్లాడక పోయినా, మన తిండి తినక పోయినా, మన రాగద్వేషాలకు మనిషిలా స్పందించకపోయినా - అదీ ప్రాణే కదా! దానికీ బాధ ఉంటుంది కదా, అనిపించి ఉండొచ్చావయసులో...ఆ వయసు అలోచనల్లో, భాషలో!

దీపాలు వెలిగించి(మా పెద్దమ్మ వాళ్ళింట్లో కరెంటు లేదు) అమ్మ వంట చేసింది. పెద్దమ్మ ఏదో తిన్నానని పించి లేచింది. మజ్జిగన్నం నేను తినలేనని - పొద్దున తోడు పెట్టిన పెరుగు వేసారు. పెరుగు ముద్ద నోట్లో పెట్టుకున్నాక, ఆరు బయట పడుకున్న గేదె మొహం గుర్తొచ్చింది. ఇక పెరుగన్నం తినబుద్దేయలేదు.

ముగ్గురం మళ్ళీ వసారాలోకి చేరాం. కిరోసిన్ లాంతరు వెలుగులో గేదె కళ్ళు చూస్తూ నేను, దీనంగా మా పెద్దమ్మ, అనునయిస్తూ అమ్మ.

పెదనాన్న పోయినప్పుడు కూడా మా పెద్దమ్మ ఇంత బాధ పడుండదనిపించింది!

అమ్మ 'ఇక వూరుకోవే...పద పక్కలేసుకుని పడుకుందాం' అంటే -
'ఎనిమిదొందలు పోసి కొన్నా. కొని రెణ్ణెళ్ళు కాలేదు...ఇదిప్పుడు జబ్బున పడి పోతే - ఆ ఎనిమిదొందలు ఏట్లో పోసినట్టేగదే. రెండో బర్రె, సేరు పాలు కూడా ఇయ్యడంలేదు. పాల ఖాతాలకు పాలు పొయ్యకపోతే, నా బతుకెలా?' అని చిన్నగా ఏడవడం మొదలెట్టింది!

అప్పట్లో, గేదె జబ్బుకు మా పెద్దమ్మ బతుక్కు ఉన్న 'ఆర్థిక' పరమైన లంకె నాకర్థం కాలేదు! అన్ని సంబంధాలు హార్థిక పరమైనవని అపోహ పడే అమాయకపు బతుకది(ఇప్పటికీ ఆ అమాయకత్వం నుంచీ పూర్తిగా బయటకు రాలేదని అప్పుడప్పుడూ చీవాట్లు పడుతుంటాయి).

ఆ సంఘటన గురించి ఇప్పుడాలోచిస్తుంటే - చాలా ప్రశ్నలు!
గేదె చనిపోతే, కేవలం తనకు ధన రూపంలో జరిగే నష్టం గురించి మాత్రమే ఆలోచించి మా పెద్దమ్మ బాధ పడిందా? తన బాధలో జీవ కారుణ్యపు కోణం అస్సలు లేదా? పెదనాన్న పోయినప్పటి బాధకు, గేదె పోతుందేమోనని పడే బాధకు సామ్యాలున్నాయా?

ఆలోచించాలంటే భయమేస్తోంది!

- అతిథి

Tuesday, June 5, 2007

కీర్తి కోసం కోటి ఎత్తులు

'కీర్తి కోసం కోటి ఎత్తులు' అనిపిస్తుంది కొందరిని చూస్తుంటే, కొందరి చేష్టలు వింటుంటే!పాటలు పాడడమంటే అమితోత్సాహమున్నట్లు అగుపించే ప్రాణి ఒకడున్నాడు. ఉండడమేగాక నాకు స్నేహితుడుకూడా అయ్యాడు. అతడి పేరు 'వాసు'(అనుకుందాం)!

వాసుని ఎప్పుడు కలిసినా, ఏదో మూలుగుతున్న శబ్దం చేస్తూ, కనిపించేవాడు మత్తెక్కిన కళ్ళ తో! పరిచయమైన క్రొత్తల్లో, ఏదైనా బాధతో ఏడుస్తున్నాడేమో అనుకునే వాణ్ణి!

ఒక రోజు 'నీకొచ్చిన కష్టమేమిటో చెప్పు బాసు' అనడిగాను కూడా!

'అబ్బే కష్టమేమీ లేదు. రసగంగలో ఈదులాడే టప్పుడు ఇలాగే కనిపిస్తాను. నావి ఏడుపుగొట్టు కళ్ళు కావు - అర్థ నీమిలత నేత్రాలు' అన్నాడు వాడు.

దాంతో నాకేడుపొచ్చినంత పనైంది!

గొంతు బాగోదు. అందుకునే పాటలు అఘోరించినట్లుంటాయి. Facial expressions ఏడ్చినట్లుంటాయి. వీటన్నింటికీ తోడు, సగం మూసిన కళ్ళతో, ఆ మూలుగొకటి!

వూళ్ళో శ్రీరామనవమి పందిళ్ళలో వీడిని చూసి మైకులు దాచేయడం ఎప్పటినుంచో జరుగుతోంది.

ఈ మధ్యన పెళ్ళి కొడుకులు, వీడు పెళ్ళి మండపాల ఛాయలకు వస్తే, పెళ్ళి పీటల మీంచీ 'లేచి' పోతామని ప్రకటించేశారు. ఆడ పెళ్ళి వారు, వీడిని పెళ్ళిళ్ళకు పిలవడం మానేసారు.

ఊళ్ళో దొంగల హడావిడి ఉన్నప్పుడు, ఊరి జనం రాత్రుళ్ళు వంతులు వేసుకుని కాపలా తిరిగినట్లు - పెళ్ళి పందిళ్ళ దగ్గర కొంత మంది వీడిని అడ్డుకోడానికి వంతులు వేసుకుని కాపలా ఉండడం మొదలెట్టారు.

కొన్నాళ్ళు పాపం చిన్న పిల్లలు దొరికిపోయే వాళ్ళు...ఏదో చాక్లెట్లకు , బిస్కట్లకు ఆశ పడి! వీడి పాట కచేరీ దెబ్బకు, పిల్లలకు దడుపు జ్వరాలు రావడం మొదలయ్యాక - పెళ్ళి పందిళ్ళ కాపలా వ్యవస్థ పిల్లల సంరక్షణ వరకు విస్తరించింది.

ఇంత జరుతున్నా - వాసు వాడి మానాన వాడు, పాటలు రాసుకుంటూ, పాడుకుంటూ ఉన్నాడు! పైపెచ్చు - రోడ్డు మీద పోయే ఏనుగు, మొరిగే కుక్కల్ని పట్టించుకుంటే ఎలా అని, తన్ని తాను ఏనుగును చేసుకుని - తన టాలెంటు చూసి ఓర్వలేని కుళ్ళు బోతు జనం అరుపులు తానెన్నటికీ పట్టించుకోనని - చెవుల్లో దూది పెట్టుకుని తన పాటనాపలేరని - పాట రూపంలోనే కక్కేవాడు.

మన ఖర్మ కాలి, పాట అయ్యేదాకా ఆ దరిదాపుల్లో ఉంటే, తన పాటలను ఎంత మంది ఎలా మెచ్చుకు(కుంటు)న్నారో చిట్టా విప్పి మరీ చెప్పేవాడు.

వినే వాళ్ళకు అసలు విషయం తెలిసినా, తెలియనట్లు నటిస్తూ వినోదం పొందేవాళ్ళు. వాడికి ఇంకో నాలుగు తాటాకులు కట్టి నవ్వుకునేవాళ్ళు.

వాసు ధ్యేయమల్లా మంచి గాయకుడిగా పేరు తెచ్చుకోవడం. విరివిగా సన్మానాలు, సత్కారాలు పొందడం.

ఒకసారి తెగించి, 'బాసూ - నీకేమైనా సంగీతం తెలుసా, ఎక్కడైనా నేర్చుకున్నావా' అనడిగా.
కోకిల ఎక్కడ నేర్చింది గానం, తంబురా ఎవడిదగ్గర నేర్చుకుంది రాగం అంటూ, చెవులు బొప్పి కట్టేలా, ఆశువుగా పాటలు కట్టి మరీ ఉతికి ఆరేసాడు.

అప్పటినుంచీ వాణ్ణి పూర్తిగా తప్పించుకు తిరగడం మొదలు పెట్టా! మిత్ర బృందంలో మిగిలిన వాళ్ళు కూడా అత్యవసరమైతే తప్ప వాసుకు ఎదురుపడటం మానేసారు.

అదలా ఉండగా, నిన్న ఒక స్నేహితుడు కాళ్ళకు చేతులకు బేండేజీలు కట్టుకుని కనిపించాడు, విషయమేమిటని పలకరించా!

ఒక్కసారిగా భోరు మన్నాడు. నిన్న ఏదో పొలిటికల్ పార్టీ మీటింగుకు వెళితే, అక్కడ అందరికీ షాకిస్తూ వాసు ప్రత్యక్షమయ్యాడట. కార్యకర్తలను తోసుకుంటూ వెళ్ళి, వేదిక నెక్కి, మైకు దొరక పుచ్చుకుని - పార్టీ మీద తను కట్టిన పాటను పదే పదే పాడటం మొదలెట్టాడట.

మంత్రిగారు బ్రతిమలాడినా, కార్యకర్తలు కాళ్ళా వేళ్ళా పడ్డా, పోలీసులు బెదిరించి మైకు కట్ చేసినా ఇసుమంతైనా కనికరించలేదట వాసు. దాంతో అందరూ తలో దిక్కుకు పరుగులు తీస్తూ పారిపోయారని, ఆ తొక్కిసలాటలో తనకు గాయాలయ్యాయని చెప్పాడు!

నాకు వెన్నులోంచీ వణకు పుట్టింది. చిరంజీవి స్టాలిన్ సినిమా చివరి సీనులో, లారీలోంచి ఒక రౌడీ ప్రకాష్ రాజ్ తో మాట్లాడుతూ - కత్తులు, బాంబుల రేంజి ని దాటి ఎక్కడికో ఎదిగి పోయాడని చెబుతాడు. అది గుర్తొచ్చింది నాకు, వాసును తలుచుకుంటే!

వాడి పాటల సత్తా వాడికి తెలియక - నిజంగానే తాను గొప్పగా పాడుతున్నానని, పాటలు కడుతున్నానని - వాసు అనుకొంటున్నాడని ఎందుకో నాకనిపించదు.

పోనీ ధనరూపంలో ఏమైనా లభిస్తోందా అంటే అదీలేదు.

మరెందుకిదంతా అంటే - ముతగ్గా చెబితే 'దురద', నాజూగ్గా చెప్పాలంటే 'కీర్తికండూతి'!
వాసు లాంటి వాళ్ళు, అన్ని రంగాల్లోనూ కనిపిస్తుంటారు!! తస్మాత్ జాగ్రత్త!!!

- అతిధి

Saturday, June 2, 2007

బాదంకాయ పళ్ళెం

ఇవ్వాళ మధ్యాహ్నం భోజనం చేసేప్పుడు మా అబ్బాయి (కొడుకు)తో చాలా పెద్ద గొడవే అయింది! తింటే తిను లేకుంటే మానేయ్ అన్నదాకా వెళ్ళింది వ్యవహారం.
సాయంత్రమయ్యాక మా అమ్మకు యధాలాపంగా ఫోన్ చేసాను. చాలా రోజులౌతోంది ఫోను చేసి అన్నదామె.
మీ మనవడు నాక్కాస్త టయమిస్తే కదా ఫోను చేసేది అన్నా! పిల్లలు పుట్టకముందు, ఎవరైనా పిల్లలను సాకుగా చూపించి - ఫంక్షన్లు ఎగ్గొట్టినప్పుడు, బోర్ కొట్టే పూజలకు రానప్పుడు ... ఆహా పిల్లలున్న వాళ్ళ పని ఎంత హాయి! ఎంచక్కా పిల్లల పేరు చెప్పి నానా హింస తప్పించుకుంటున్నారు అని తెగ కుళ్ళు కునే వాళ్ళం. కానీ మాకూ పిల్లలొచ్చాక( మాకు ఇద్దరు - ఒకబ్బాయి ఒకమ్మాయి), పిల్లలు గల వాళ్ళ బాధలు అర్థమవుతున్నాయి. కుళ్ళు స్థానంలో, జాలి చేరింది! మొన్నీ మధ్య ఒకరికి ఫోను చేసి, చిన్నపాటి confession కూడా ఇచ్చేసాను.
మళ్ళీ మా అమ్మతో ఫోను సంభాషణలోకి వస్తే - అంత అల్లరి చేస్తున్నాడా అనడిగింది. వాడు అల్లరి స్థాయిని ఏనాడో దాటేసాడు, అల్లరికి కొత్త అర్థాలు చెబుతున్నాడు అని వాపోయా!
ఇంతకీ ఏమి చేసాడు అనడిగింది.
వాడి ఫ్రెండెవడికో Cars movie charectars బొమ్మలున్న కంచం, గిన్నె (bowl), గ్లాసూ ఉన్నాయట. అవి తనకూ కొనాలట. వాటిలోనేఆహారం, ఫలహారం మింగుతాడట... అంటూ మళ్ళీ కోప్పడుతూ చెప్పాను.
పాపం పిల్లాడు అంది మా అమ్మ.
నీలాంటి వాళ్ళ వల్లనే పిల్లలు చెడి పోతున్నారు అన్నాను.
పోన్లే వాడేదో ముచ్చట పడుతున్నాడు కొనిద్దూ అంది.
నన్నేదో వూరడిస్తుందని తనముందు వాపోతే, ఈవిడ కూడా వాడినే వెనకేసుకొస్తోంది ... అందుకే అసలు కంటే వడ్డీ ముద్దంటారు.
ఇంత పెద్దదానివి నువ్వే అలా అంటే ఎలా? ఏ పళ్ళెం లో తింటే ఏమిటి? తినే అన్నం కూరలూ ఒకటే కదా అన్నాను కోపంగా!

అబ్బా ఆ వయసులో వాడికవేమి తెలుస్తాయి - పాపం వాడడిగింది ఇవ్వొచ్చుగా అంటూ ఆవిడ మొదలెట్టింది.

Cars movie లో కారెక్టర్లన్నీ వాడికి తెలుసు. ఏ పళ్ళెంలోనైనా తినే పదార్థాలు ఒకటేనని ఎందుకు తెలియదు అనడిగాను.

నువ్వూ చిన్నప్పుడు అంతే! చిన్నప్పుడేమిటి, హైస్కూల్లో చదువునకునేటప్పుడూ అంతే. బాదంకాయ పళ్ళెంలో తప్పితే తిననని! అప్పుడు నేనూ నీకులాగే చాలా లాజిక్కులు చెప్పేదాన్ని. నువ్వు వింటేగా! చుట్టాలొచ్చినప్పుడు కూడా నీ పళ్ళెం నీకే కావాలని ఒకటే గోల. గుర్తు లేదా అడిగింది అమ్మ!

మా ఇంట్లో బాదం షేపు పళ్ళెం, వంకులున్న స్టీలు గ్లాసు నాకింకా గుర్తే! వాటిలోనే తినాలని తాగాలని మారాం చేయడం ఇప్పుడిప్పుడే గుర్తుకొస్తోంది. అప్పుడప్పుడూ అలగడం కూడా!

అంత బాగా గుర్తులేదు...అంటూ కార్ తాళాలు తీసుకుని - సర్లే అమ్మా మళ్ళీ కాల్ చేస్తా. షాపులు కట్టేసే టయమయింది... వాడికా ప్లేటు గిన్నె కొనుక్కొస్తా అంటూ ఫోను పెట్టేసాను, మా అబ్బాయిని తీసుకుని షాపుకు బయల్దేరడానికి సిద్ధ మవుతూ!