Sunday, September 23, 2007

రెండు జలక్‌లు

ఈ రోజు మా అబ్బాయి నాకు రెండు జలక్‌లిచ్చాడు.
కూరగాయల కొట్టులో రెండు పెద్దదా మూడు పెద్దదా అనడిగా, అదే పనిగా ఏదో కొనివ్వమని గోల పెడుతుంటే, కాస్త పక్క దారి పట్టిద్దామని!
రెండు పెద్దది అన్నాడు.
హమ్మయ్య దొరికాడు నా కొడుకు అనుకుంటూ, 'ఎలా?' అనడిగా.
సమాధానమెలా చెప్పాలో తట్టినట్లు లేదు. మొదట చెప్పిందే 'రెండు పెద్దది' అని మళ్ళీ అన్నాడు.
వన్, టూ, త్రీ...లు చెప్పమన్నా.
పది వరకు వరుస క్రమం లో చెప్పాడు.
టూ తర్వాత త్రీ వస్తుంది కాబట్టి త్రీ పెద్దది అని చెప్పా, అలా ఒప్పించగలననుకుని.
ఊహూ...ఒప్పుకోలేదు!
పైగా 'మరి జూలియా కంటే ఎల్లీ పెద్దది కదా' అన్నాడు.
పక్కింటి వాళ్ళ అమ్మాయిల ప్రస్తావన ఎందుకు తెచ్చాడా అని అనుకుంటుండగానే, లైట్ వెలిగి - 'అమ్మ నా కొడుకా...' అనుకున్నా!
మా పక్కింటి వాళ్ళ ముగ్గురు పిల్లల్లో ఎల్లీ (ఎలిజబెత్) రెండవది. మూడో అమ్మాయి పేరు జూలియా!
* * *
ఈ దెబ్బ నుంచీ తేరుకున్నాను అనుకున్నాక, సాయంత్రం కారులో చిన్న పనిమీద అందరం...అనగా పది నెలల నా కూతురుతో బాటు...బయటకు బయల్దేరాం.
మా అమ్మాయిని 'ఫేన్ ఏదమ్మా?' అనడిగితే, ఎక్కడున్నా, ఏమి చేస్తున్నా -తలపైకెత్తి చూస్తూ 'అదో' అన్న శబ్దం చేస్తుంది!
దారిలో ఒక సారి 'ఫేన్ ఏదమ్మా?' అనడిగాను నేను.
చైల్డ్ సీటులో తల వీలైనంత పైకెత్తి 'అదో' అంది.
నవ్వుకుంటూ, మా అబ్బాయిని 'నువ్వేమి చూస్తున్నావు?' అనడిగా.
'గ్రీన్ ఫేన్స్ చూస్తున్నా' అని శలవిచ్చాడు.
'గ్రీన్ ఫేన్సా?' అని ఆశ్చర్యంగా అడిగేసరికి - 'అదే...చెట్లు చూస్తున్నా'అన్నాడు నా కర్థమయ్యేలా చెబుతూ!
ఇప్పటికీ వాడికా ఊహ ఎలా వచ్చిందా అని ఆలోచిస్తున్నా! బహుశా నేను అనుకునేది, వాడు అనుకునేది (గ్రీన్ ఫేన్స్ అంటే) వేరు కావచ్చు. కానీ నాకైతే - చాలా పొయెటిక్ గా చెప్పాడనిపించింది(కాపికాము సిండ్రోం :-) )!
* * *
పిల్లలు చేసే సరదా పనులు, సంభాషణలు వ్రాసి దాచుకుందామని - జర్నల్ ఒకటి కొన్నాను మూడేళ్ళ క్రితం, మా అబ్బాయి పుట్టిన మూడు నెలల తర్వాత. అప్పట్నుంచీ ఆ పుస్తకాన్ని చెక్కు చెదరకుండా, సిరా మరక పడకుండా కాపాడుకొస్తున్నాం...తీరిక దొరక్క!
ఇకనుంచీ, ఇలా బ్లాగులో వ్రాసుకుని దాచుకోవచ్చేమోననిపించింది - ఇలాంటి జ్ఞాపకాలను!

Sunday, September 16, 2007

చిరంజీవి పార్టీ పెడతారా?

చిరంజీవి పార్టీ పెడతారా? 1983 లో నందమూరి తారక రామారావు గారిలా విజయ దుందుభి మోగిస్తారా?!

రాజకీయ, సామాజిక పరిస్థితుల్లో అప్పటికీ ఇప్పటికీ చాలా తేడా ఉంది కదా!

రామారావుకు అప్పటి ప్రజల్లో ఉన్నది కేవలం సినీ నటుడు అన్న అభిమానం మాత్రమే కాదు. ఒక లాంటి ఆరాధనా భావం, ఆప్యాయత ఉండేవి. రాజకీయంగా ఉన్న శూన్యానికి రామారావు గారి మీది అచంచలమైన ప్రేమ తోడవడం మూలానే, ఎందరో ఉద్దండ నాయకులూ, స్వాతంత్ర పోరాటంలో ముఖ్య భూమిక వహించిన కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో దిక్కూ దివాణం లేకుండా పోయాయి.

మరిప్పుడు చిరంజీవిని ప్రజలు అంతగా ఆదరిస్తారా?! ఇప్పటికే కొందరు నాయకులు ఆయనకు కులం రంగు పూయాలని ప్రత్నించడం మొదలెట్టారు.

పైగా వట వృక్షం లాంటి కాంగ్రెస్, జనాలకు క్రొత్త రాజకీయాలను చూపెట్టిన తెలుగుదేశం, ప్రజా సమస్యల మీద పోరాటాలు సాగిస్తున్న కమ్యూనిస్టులు, ప్రత్యేక తెలంగాణా కోసం చెమటోడుస్తున్న తెరాస, మంచి మార్పుల కోసం ఉద్భవించి శ్రమిస్తున్న లోక్సత్తా - వీటన్నింటి మధ్యలో చిరంజీవి రాణించగలడా?

ఆయన రాజకీయ రంగంలోకి దూకడానికి, పందెంలో నెగ్గుకు రావడానికి అనువైన పరిస్థితులు లేవనే నాకనిపిస్తోంది.

ప్రస్తుతం నిరాదరణలకు, నిర్లక్ష్యాలకూ గురవుతున్న కొందరు (వీళ్ళను పట్టించుకోని పార్టీలనుంచీ బయటకొస్తే - ఇక అంతే సంగతులు. అందుకే అలా రారు) చెట్టు నీడ కోసం వెదుకుతున్నారు. వారికి చిరంజీవి సేద దీర్చే చెటులాగా కనిపిస్తున్నాడు. హీరోతో పార్టీ పెట్టించి, గెలిస్తే అధికారం అనుభవించగలరు వీళ్ళు. ఓడితే, చిన్నగా ఎక్కణ్ణుంచీ వచ్చారో అక్కడికి వెళ్ళ గలరు! అప్పుడు చిరంజీవి పరిస్థితి ఏమిటి? మళ్ళీ సినిమాల్లోకే వెళ్ళాలి!

నిజంగా ప్రజాసేవ చెయ్యడానికే అయితే - ఇప్పుడు చిరంజీవి నిర్వహణలో సాగుతున్న రక్త దానాలు లాంటివి, ఏ రాజకీయ పార్టీల అండ లేకుండా చాలా బాగా చెయ్యొచ్చు. ఈ మధ్యనే ఒక రచయిత 'మన దేశంలో రాజకీయాల్లోకి వచ్చి ప్రజా సేవ చెయ్యడానికి ఉన్నంత పోటీ మరి దేనికి లేదు ' అని చెప్పారు.

ఈ టపా వ్రాసి చాలా రోజులైంది. నేను వ్రాసినప్పటికి, ఇప్పటికీ రాష్ట్రంలో రాజకీయాలను ప్రభావితం చేసే సంఘటనలు చాలానే జరిగాయి.
చిరంజీవి కమ్యూనిస్టు పార్టీ నాయకులను వారం క్రితం కలవడం, చిరంజీవి రాజకీయాల్లోకి వస్తే స్వాగతిస్తామని నిన్ననో మొన్ననో రాఘవులు గారు అనడం...మొత్తానికీ ఈ విషయంలో ఏదో కదలిక మొదలైందని తలుపుతోంది.

చిరు పార్టీ పెడతారా? పెట్టినా విజయం సాధించి - "ప్రజా సేవ" చేస్తారా అన్నది చాలా పెద్ద ప్రశ్నే!