Tuesday, February 12, 2008

ఒక సినిమా (బాగా నచ్చిన) సన్నివేశం

త్రివిక్రం 'అతడు ' సినిమాలో, ప్రకాష్ రాజ్ - మొదటి సారి మహేష్ బాబు కోసం నాజర్ (ఈజీగా ఉండడానికి నటుల పేర్లే వాడుతున్నా) వాళ్ళింటికి వచ్చే సన్నివేశం గుర్తుందా?

నాజర్, గిరిబాబు చదరంగం ఆడుతుంటారు. ప్రకాష్ రాజ్ అక్కడకు వచ్చి ఆటలో (రెండు మూడు) ఎత్తులు వేస్తాడు! తర్వాత పార్థు(మహేష్ బాబు)ను కలవడానికి వచ్చానని నాజర్ కు చెబుతాడు.

మహేష్ బాబు కోసం వెయిట్ చేస్తూ - తన CBI కొలీగ్స్ తో మహేష్ బాబు వేలి ముద్రలు సంపాయించడానికి, ఉన్న ఒకే ఒక్క విజిటింగ్ కార్డ్ మీద పౌడర్ వేసి తెమ్మంటాడు.

మహేష్ బాబు వచ్చాక, తనను పరిచయం చేసుకుని పౌడర్ అద్దిన కార్డ్ మహేష్ బాబు చేతికి చూడ్డానికి ఇచ్చి, మళ్ళీ తీసేసుకుంటాడు. తీసేసుకుంటూ 'ఇంత తేలిగ్గా దొరుకుతావనుకోలేదూ అంటాడు, చిన్న నవ్వుతో.

ఇద్దరూ కుర్చీల్లో ఎదురెదురుగా కూర్చుంటారు, మధ్యలో బల్ల ఉంటుంది.

కాసేపు మాటలయ్యాక 'రైల్లో హత్య జరిగినప్పటి డిటెయిల్స్ గుర్తొచ్చినప్పుడు ఫోను చెయ్యి' అని మహేష్ బాబుతో చెబుతాడు ప్రకాష్ రాజ్.
'నా దగ్గర మీ ఫోను నంబర్ లేదు' అని మహేష్ బాబు అన్నాక, వేలిముద్రలున్న విసిటింగ్ కార్డ్ ను మహేష్ బాబుకు ఇచ్చేస్తాడు ప్రకాష్ రాజ్. కార్డ్ ఇవ్వడానికి చేయి ముందుకు సాచినప్పుడు, CBI వాళ్ళు ప్రకాష్ రాజ్ వైపు కొరకొరా చూడ్డంతో, తనేమి చేస్తున్నాడో ప్రకాష్ రాజ్ కి అర్థమౌతుంది.

మహేష్ బాబు కార్డ్ మీది పౌడర్ను ఉఫ్ఫని వూదేసి, కార్డును నలిపేయడంతో ఆ సన్నివేశం ముగుస్తుంది!

అప్పుడర్థమైంది, సన్నివేశం మొదట్లో చదరంగం ఆట ఎందుకు చూపించారో! ఎంత చక్కటి స్క్రీన్ ప్లే అనిపించింది.

సన్నివేశమంతా - ఎత్తులు పైఎత్తులే కదా, ఒక రకంగా ప్రకాష్ రాజ్ - మహేష్ బాబు మన ముందు ఆడింది చదరంగమే కదూ!

ఇలా పకడ్బందీగా తీసిన మరికొన్ని సన్నివేశాలు ఈ సినిమాలో ఉన్నై. వాటి గురించి మరో సారెప్పుడైనా!

కానీ, ఇంత బాగా తీసిన సన్నివేశంలో - ప్రకాష్ రాజ్ కు, అక్కడున్న మిగిలిన CBI వాళ్ళకు ఫోనులో జరిగే సంభాషణలో (కార్డ్ - పౌడర్ గురించి) - ప్రకాష్ రాజ్ 'ఆ హత్య ఏమిటి, శివారెడ్డి మర్డర్ కూడా వీడే చేసి ఉండొచ్చుగా. చాన్స్ తీసుకోవద్దు రవీ' అంటాడు!
ప్రకాష్ రాజ్ బృందం వచ్చింది శివారెడ్డి హత్య కేసును ఛేదించడానికి. రాజీవ్ కనకాలను రైల్లో పోలీసులు (చరణ్ రాజ్) పొరపాటున కాల్చారని CBIకి తెలుసు. మరి ప్రకాష్ రాజ్ ప్రస్తావించినది ఏ హత్య గురించి?

[సన్నివేశం లింక్ పెడితే బావుండనిపించింది. కానీ నాకు youtubeలో దొరిక లేదు.]

3 comments:

మాకినేని ప్రదీపు said...

ప్రకాశ్‌రాజ్ మహేష్‌బాబును హంతకునిగా అనుమానిస్తున్నప్పుడు అతనితో "ఇంత తేలిగ్గా దొరుతావనుకోలేదు" అని ఎందుకనాలి? దాని తరువాత మహేష్‌బాబు ప్రకాశ్‌రాజ్ ల మధ్య జరిగే సంభాషనలు కూడా చాలా నాటకీయంగా అనిపిస్తూ ఉంటాయి. నాకు ఆ సన్నివేశాన్ని పకడ్బందీగా తీశామని అనిపించుకోవటానికే తీసినట్లుగా అనిపించింది.

నాకు కూడా ఈ సినిమాలో నచ్చిన సన్నివేశాలు చాలా ఉన్నాయి, వాటిలో ఒకటి సినిమా మొదట్లో టీకొట్టు దగ్గరి సన్నివేశం ఒకటి. ఆ సన్నివేశంలో visual effects మరియూ రంగుల కలయికను చాలా బాగా వాడుకున్నారని అనిపించింది.

Budaraju Aswin said...

ప్రదీప్ గారు ...
పోలిసుల సహజ సిద్దమైన అలవాటు అనుమానించటం ...
" ఇంత తేలిగ్గా దొరుకుతావని అనుకోలేదు అని అన్నప్పుడు హంతకుల యొక్క ప్రవర్తనలోని మార్పును గమనించటానికే అని నా అభిప్రాయం ...

అందులోనూ ఆ సన్నివేశములో వాళ్ళిద్దరిమధ్య చోటు సంభాషణలు చాలా బావున్నాయి.

హంతకుడు..పోలీస్ ఇద్దరూ తెలివి గలవాళ్ళైతే .. వారిద్దమద్య సన్నివేశాని చాలా అద్భుతంగా చిత్ర్రీకరించటం చాలా బావుంది...

ఇంతే కాదు ఆ సినిమాలోని ప్రతొక్క అంశం అద్భుతం..
త్రివిక్రం వార్ల దగ్గర నుండీ మళ్ళీ డైలాగులకు కొత్త రూపమ్ వచ్చిందని చెప్పవచ్చు

యామిని said...

e sinimaale chetta inka nachchina sannivesam daaniki review koodana