Tuesday, February 26, 2008

ఈ మధ్య చూసిన ఒక సినిమా!

చీకటిని చూసి తిట్టుకుంటూ కూర్చుంటే ఏమి లాభం...ఒక చిరు దీపాన్ని వెలిగిస్తే కదా లాభం అనుకుని - ఇప్పుడొస్తున్న కొన్ని నాసి రకం సినిమాలను చూసి 'యాక్ యాక్ ' అంటూ తిట్టుకునే బదులు, మనమే (అనగా నేనే) ఒక సినిమా తీసి, సినిమా అంటే ఇలా ఉండాలి అని చూపెడితే కదా ఉపయోగం అనిపించింది.
ఆలోచన భేష్ గా ఉందని నాకు నేనే చప్పట్లు కొట్టుకుని, భుజం తట్టుకున్నా.
చేతుల నొప్పి తగ్గక ముందే, సినిమా తీయడమం చూసినంత 'వీజీ' కాదు అని రియలైజయ్యా! 'కష్టే హిట్ల ప్రాప్తి రస్తు' అన్న పండిత వాక్కులను మరో సారి పునశ్చరణం చేసుకుని, పంచాంగం చూడకుండానే పని మొదలెట్టా!

హీరోల దగ్గరనుంచీ పోస్ట్ మాన్ వేషమేసే వాళ్ళ వరకు, లైట్ బోయ్ దగ్గర నుంచీ మైక్ బాయ్ (దర్శకుని) దాకా, ఏ ఆరు నెలలకో ఒక సినిమా చూసి పెదవి విరిచే సాదాసీదా ప్రేక్షకుడి నుంచీ, రోజుకు కనీసం రెండు సిన్మాలు కళ్ళతో గ్రోలే ప్రేక్షకాగ్రేసరుల వరకూ - అందరూ అనేది - కథలకు కరువొచ్చించదని, అందుకే ఎక్కడెక్కడి నానా చెత్తా తెలుగు సినిమా తెరలమీద పేరుకు పోతోందని వాపోతుంటారు కదా!
[రెండు విషయాలు - 1. ఇక్కడ గెండర్ వివక్ష లేదు. హీరోయిన్లు, గంతుల పాటల్లో గొంతు కలపక పోయినా, గెంతులు కలిపే ఎక్స్ట్రా ఆర్టిస్టులు...దర్శకురాళ్ళు, ప్రేక్ష్కురాళ్ళు కూడా కథల గురించి బాధ పడుతున్నారు. 2. నేనిక్కడ ఉటంకించిన ఏదో వర్గంలో నేనూ కూడా ఉన్నానని డిస్క్లైమర్!]

అందుకే మాంచి రంజైన కథ రాద్దామనుకున్నా. ఒక వారం తర్వాత కథ రాయడం అంత తేలికైన పని కాదని తేలిపోయింది. మనం రాయక పోయినా, మంచి కథను వ్రాసే వాళ్ళు, మంచి కథను గుర్తించే వాళ్ళు వుంటే చాలనిపించింది.

హమ్మయ్య...!

కథ తర్వాత, కథ కంటే బలంగా ఉండాల్సింది కథనం...స్క్రీన్ ప్లే!
దాని సంగతేదో చూద్దామని పరిశోధన మొదలెట్టినప్పుడు, కొన్ని పుస్తకాలు చదువుతూ - పుస్తకాల్లో ఉటంకించిన సినిమాలు చూడ్డం మొదలెట్టాను.

అప్పుడు తారసపడ్డ చిత్రాల్లో ఒకటి '12 Angry Men'!
ఈ సినిమాను రెండేళ్ళ క్రితమొకసారి చూసాను. బాగా నచ్చింది.
12 మంది జ్యూరీ సభ్యులు, హత్య కేసులో ముద్దాయి - నిజంగా నేరం చేసాడా లేదా అన్నదాన్ని తేల్చాలి, ఏకగ్రీవంగా.

12 మందిలో ఒకడికి తప్ప మిగిలిన వాళ్ళందరికీ - ఆ కేసు 'open and shut' కేసు! ఒక్కరికి మాత్రం - ముద్దాయి నేరం చేసి ఉండక పోవచ్చునేమో అన్న సంశయం ఉంటుంది. జూరీలో మిగిలిన 11 మంది చివరికి ఏమి చేస్తారు, ఎందుకు చేస్తారు అన్నది తెర మీద చూడాల్సిందే!

దాదాపు సినిమ అంతా ఒక గదిలో జరుగుతుంది (సుమారు 3 నిమిషాల కోర్టు సీను, చివరి సీను తప్పిస్తే)!

వీలైతే తప్పక చూడండి!

అంతర్లీనంగా, నాయకుని(leader)కి ఉండాల్సిన లక్షణాల గురించి కూడా ఈ సినిమా ఒక అవగాహనకలిగిస్తుంది.

ఈ సినిమా గురించిన మరి కొన్ని ఆసక్తి కరమైన అంశాలు ఇక్కడ -
http://en.wikipedia.org/wiki/12_Angry_Men

ఓపిక చేసుకుని వెదికితే youtubeలో కూడా ఈ సినిమా దొరుకుతుంది.

ఇకపోతే, నా సినిమా తీసే ప్రయత్నాలు ఎలా కొనసాగుతున్నాయి అన్నది, మరో సారి - ఇంకో టపాలో, వీలు దొరికినప్పుడు!

Tuesday, February 12, 2008

ఒక సినిమా (బాగా నచ్చిన) సన్నివేశం

త్రివిక్రం 'అతడు ' సినిమాలో, ప్రకాష్ రాజ్ - మొదటి సారి మహేష్ బాబు కోసం నాజర్ (ఈజీగా ఉండడానికి నటుల పేర్లే వాడుతున్నా) వాళ్ళింటికి వచ్చే సన్నివేశం గుర్తుందా?

నాజర్, గిరిబాబు చదరంగం ఆడుతుంటారు. ప్రకాష్ రాజ్ అక్కడకు వచ్చి ఆటలో (రెండు మూడు) ఎత్తులు వేస్తాడు! తర్వాత పార్థు(మహేష్ బాబు)ను కలవడానికి వచ్చానని నాజర్ కు చెబుతాడు.

మహేష్ బాబు కోసం వెయిట్ చేస్తూ - తన CBI కొలీగ్స్ తో మహేష్ బాబు వేలి ముద్రలు సంపాయించడానికి, ఉన్న ఒకే ఒక్క విజిటింగ్ కార్డ్ మీద పౌడర్ వేసి తెమ్మంటాడు.

మహేష్ బాబు వచ్చాక, తనను పరిచయం చేసుకుని పౌడర్ అద్దిన కార్డ్ మహేష్ బాబు చేతికి చూడ్డానికి ఇచ్చి, మళ్ళీ తీసేసుకుంటాడు. తీసేసుకుంటూ 'ఇంత తేలిగ్గా దొరుకుతావనుకోలేదూ అంటాడు, చిన్న నవ్వుతో.

ఇద్దరూ కుర్చీల్లో ఎదురెదురుగా కూర్చుంటారు, మధ్యలో బల్ల ఉంటుంది.

కాసేపు మాటలయ్యాక 'రైల్లో హత్య జరిగినప్పటి డిటెయిల్స్ గుర్తొచ్చినప్పుడు ఫోను చెయ్యి' అని మహేష్ బాబుతో చెబుతాడు ప్రకాష్ రాజ్.
'నా దగ్గర మీ ఫోను నంబర్ లేదు' అని మహేష్ బాబు అన్నాక, వేలిముద్రలున్న విసిటింగ్ కార్డ్ ను మహేష్ బాబుకు ఇచ్చేస్తాడు ప్రకాష్ రాజ్. కార్డ్ ఇవ్వడానికి చేయి ముందుకు సాచినప్పుడు, CBI వాళ్ళు ప్రకాష్ రాజ్ వైపు కొరకొరా చూడ్డంతో, తనేమి చేస్తున్నాడో ప్రకాష్ రాజ్ కి అర్థమౌతుంది.

మహేష్ బాబు కార్డ్ మీది పౌడర్ను ఉఫ్ఫని వూదేసి, కార్డును నలిపేయడంతో ఆ సన్నివేశం ముగుస్తుంది!

అప్పుడర్థమైంది, సన్నివేశం మొదట్లో చదరంగం ఆట ఎందుకు చూపించారో! ఎంత చక్కటి స్క్రీన్ ప్లే అనిపించింది.

సన్నివేశమంతా - ఎత్తులు పైఎత్తులే కదా, ఒక రకంగా ప్రకాష్ రాజ్ - మహేష్ బాబు మన ముందు ఆడింది చదరంగమే కదూ!

ఇలా పకడ్బందీగా తీసిన మరికొన్ని సన్నివేశాలు ఈ సినిమాలో ఉన్నై. వాటి గురించి మరో సారెప్పుడైనా!

కానీ, ఇంత బాగా తీసిన సన్నివేశంలో - ప్రకాష్ రాజ్ కు, అక్కడున్న మిగిలిన CBI వాళ్ళకు ఫోనులో జరిగే సంభాషణలో (కార్డ్ - పౌడర్ గురించి) - ప్రకాష్ రాజ్ 'ఆ హత్య ఏమిటి, శివారెడ్డి మర్డర్ కూడా వీడే చేసి ఉండొచ్చుగా. చాన్స్ తీసుకోవద్దు రవీ' అంటాడు!
ప్రకాష్ రాజ్ బృందం వచ్చింది శివారెడ్డి హత్య కేసును ఛేదించడానికి. రాజీవ్ కనకాలను రైల్లో పోలీసులు (చరణ్ రాజ్) పొరపాటున కాల్చారని CBIకి తెలుసు. మరి ప్రకాష్ రాజ్ ప్రస్తావించినది ఏ హత్య గురించి?

[సన్నివేశం లింక్ పెడితే బావుండనిపించింది. కానీ నాకు youtubeలో దొరిక లేదు.]