పచారీ దుకాణం రద్దీగా ఉంది.
దుకాణం గుమ్మం ప్రక్కన పాత పేపర్ల కట్ట ముందు నుంచుని ఒక్కో పేపరును తెరిచి, జాగ్రత్తగా పేజీలు తిప్పుతున్న కిట్టిగాణ్ణి ఎవరైనా క్రొత్త వాళ్ళు చూస్తే - వాడేదో సినిమా బొమ్మల కోసము పేపర్లను గాలిస్తున్నాడనుకుంటారు!
కానీ, ప్రభుత్వ ఎలిమెంటరీ స్కూల్లో, నాలుగో తరగతి బి సెక్షన్ లో కిట్టిగాడితో పాటు చదువుకునే పిల్లల్ని గానీ, వాళ్ళకు చదువు చెప్పే టీచర్ ను గానీ అడిగితే - కిట్టి గాడు సినిమా బొమ్మల కోసం వెదకడం లేదనీ, ఒక వైపు మాత్రమే పొరపాటున అచ్చైన పేపర్ల కోసం వెదుకుతున్నాడని చెబుతారు.
షాపులో సరుకుల పొట్లాలు కట్టడానికి కొనే పాత పేపర్లలోంచీ, ఒక వైపు అచ్చవని పేపర్లను తెల్ల కాగితాల క్రొత్త నోటు పుస్తకాలు కొనుక్కోలేని కిట్టిగాడి లాంటి పిల్లలకు బాగా తక్కువ ధరకు అమ్ముతాడు షాపతను. ఒక్కోసారి షాపతను మాంఛి హుషారులో ఉన్నప్పుడు, పేపర్లతో బాటు రంగు రంగుల వారపత్రికల కవర్ పేజీలను కొసరుగా ఇస్తుంటాడు.
అలా షాపులో కొనుక్కున్న పాత పేపర్లను భద్రంగా తీసుకెళ్ళి తల్లికి ఇస్తే, ఆవిడ ఓపిగ్గా దారంతో పేపర్లను నీటుగా కట్ చేసి, కిట్టిగాడు ఇష్టపడే చిరంజీవి బొమ్మనో...లేక పోతే వాడికి నచ్చిన మరో రంగుల తార చిత్రాన్నో అట్టగా వేసి, దబ్బనంతో కుట్టి తిరగలి మధ్యలో ఒక పూట ఉంచి - మొదటి పేజీ పైన 'శ్రీరామ' అని, మధ్యలో 'కాలాస్తి వెంకట కృష్ణ' అని వ్రాసి ఇస్తుంది!
అప్పుడు చూడాలి ఆనందంతో పున్నమి చంద్రునిలా వెలిగిపోయే వెంకట కృష్ణ...అదే మన కిట్టిగాడి మొహాన్ని!
వాళ్ళమ్మ తులసమ్మ - తెల్ల కాగితాల పుస్తకం వీడికి కొనిస్తే, వీడి మొహంలో ఇంకెంత సంబరం అగుపిస్తుందో అనుకుంటుంది, వాడికి పుస్తకం కుట్టి ఇచ్చినప్పుడల్లా! కొడుకు మనసు తల్లికి తెలిసినంతగా, దేవుడికి కూడా తెలియదేమో!!
బయట పేపర్ల దగ్గరే పాతుకు పోయినట్లు నిలబడ్డ కిట్టిగాన్ని కేకేసి పిలిచాడు షాపతను.
జారిపోతున్న నిక్కరును పైకి లాక్కుంటూ వస్తున్న కిట్టిగాన్ని, "ఏరా కిట్టా...పేపర్లు గావాలా?!"అడిగాడు.
కిట్టిగాడు అడ్డంగా తలూపి "ఉప్పు కావాలి" అన్నాడు.
షాపతను పక్క షెల్ఫులో తెల్లగా మెరుస్తున్న ఉప్పు పేకెట్ ను తీసి, కౌంటర్ మీద నుంచీ కిట్టిగాడి వైపు తోసాడు.
"సాల్టు కాదు...ఉప్పు...మామూలు ఉప్పు కావాలి"అన్నాడు బెరుకుగా!
షాపతను బిగ్గరగా నవ్వాడు.
"అరే కిట్టప్పా - సాల్టన్నా ఉప్పన్నా ఒకటేరా"అని మళ్ళీ నవ్వి, "రంగా, వీడికి ఒక సోల నల్లుప్పు పొట్లం కట్టు"అని షాపులో పనిచేసే అబ్బాయికి చెప్పి, డబ్బు కోసం చేయి చాపాడు.
కుడి ప్రక్క జేబులో చెయ్యి పెట్టిన కిట్టిగాడు, వెంటనే ఎడమ చేత్తో ఎడమ జేబులో...చొక్కా జేబులో డబ్బుల కోసం గబగబా వెదికాడు.
మళ్ళీ మళ్ళీ వెదికాడు.
జేబులను బయటకు లాగి మరీ వెదికాడు.
"ఏరా డబ్బుల్లేవా?"అడిగాడు షాపతను.
"జేబులోనే ఉండాలి సేట్"అంటూ మళ్ళీ జేబుల్లో వెదికి, నిలబడ్డ చోట నేల మీద చుట్టూ చూసి,"ఇప్పుడే వస్తా" అంటూ షాపు బయటకొచ్చి, పాత పేపర్ల కట్ట చుట్టూ, క్రిందంతా వెదికాడు.
ఇంటి నుంచీ షాపుకొచ్చిన దారంతా వెదికాడు.
రోడ్డు మీద మట్టిని కాళ్ళతో నెరిపి మరీ వెదికాడు.
గాలికి ఎగిరి రోడ్డు పక్కన పడిందేమోనని, అక్కడ తుప్పల్లోనూ వెదికాడు.
ప్చ్...దొరకలేదు!
డబ్బు పోయిన సంగతి వాళ్ళమ్మకు చెప్పాలంటే భయమేసింది.
ఇల్లంతా గాలించినా చిల్లి గవ్వ దొరకలేదని, ఇల్లు పట్టకుండా తిరిగే ఇంటోడిని తిట్టుకుంటూ - ఎప్పటినుంచో అపురూపంగా దాచుకుంటున్న ఫెళ ఫెళ లాడే క్రొత్త అయిదు రూపాయల నోటును కొడుక్కిచ్చింది ఉప్పు కొనుక్కురమ్మని!
అదేమో ఎక్కడో పోయింది.
దారిలో కనిపించిన వాళ్ళందరినీ అడిగాడు.
ఈ ఒక్కసారి వెదుకుదాం...అనుకుంటూ అప్పటికి నాలుగు సార్లు దారంతా వెదికాడు.
పోగొట్టుకున్న డబ్బు ఎవరికో దొరికే వుంటుంది. దొరికిన వాళ్ళు డబ్బు తిరిగిచ్చేలా చేయమని దేవుణ్ణి వేడుకున్నాడు కిట్టిగాడు!
అయినా వాడి అమాయకత్వం కాకపోతే - జేబులో డబ్బుల్నే కాజేసే కాలంలో, జేబులోంచి జారిపోయిన డబ్బుల్ని ఎవరైనా వదిలేస్తారా, అదీ పట్ట పగలు నలుగురు నడిచే నడి రోడ్డు మీద!
కాళ్ళు నొప్పులు పుడుతుంటే, షాపు కెళ్ళి సేట్ ను బ్రతిమలాడాడు - మళ్ళీ వొచ్చినప్పుడు డబ్బులిస్తా - ఉప్పు ఇమ్మని.
శుక్రవారం పూట అరువు మీద ఉప్పు అమ్మనని చెప్పి - షాపులోంచీ దాదాపు బయటకు తోసినంత పని చేసాడు సేట్.
* * *
ఉత్త చేతులతో ఇంటికొచ్చి భయంతో వణకుతున్న కొడుకును చూసి, తులసమ్మకు జాలేసింది.
వాళ్ళది ఒకప్పుడు తిండికీ బట్టకీ లోటు లేకుండా బతికిన కుటుంబమే!
వానల్లేక కొన్నేళ్ళు, వానలొచ్చి కొన్నేళ్ళు - పంటలు పండక, పండినా చేతికందక చితికి పోయారు. ప్రకృతి ఎప్పుడూ పేదలకు శత్రువే!
ఒకవేళ ప్రకృతి కరుణించి పంటలు పండి చేతికొచ్చినా - నోటికందనీయని మార్కెట్ ధరలు. నేలను నమ్ముకుని బతుకుతున్న వాళ్ళు...నేలను అమ్ముకుని బతుకు బండి లాగడం మొదలు పెట్టారు. వీళ్ళమ్మిన ఏడాదికో, రెండేళ్ళకో భూముల ధరలకు రెక్క లొచ్చాయి!
సీజన్ లో పొగాకు గ్రేడింగ్ పనులకు తులసమ్మ...పక్క వూళ్ళో ఫేక్టరీ పనులకు కిట్టిగాడి నాన్న వెళుతూ, రోజులు వెళ్ళ దీస్తున్నారు.
బడిలో టీచర్లు, కిట్టిగాడు బాగా చదువుతున్నాడనీ, తెలివిగలవాడనీ....చదివిస్తే వృద్ధిలోకి వస్తాడని చెప్పక పోతే, వాణ్ణీ ఏ కూలి పనిలోకో నెట్టేసే వాళ్ళు.
కిట్టిగాడి తండ్రి కంటే, తల్లికే వాడినెలాగైనా పెద్ద చదువులు చదివించాలన్న ఆశ. ఇప్పటిదాకా వాళ్ళ వంశంలో ఎవరూ నాలుగో క్లాసు వరకు వెళ్ళలేదు. వీడికి చదువు మీదున్న ఆసక్తి గమనించి, కనీసం హైస్కూలు గడపైనా తొక్కనిద్దామని తులసమ్మ కోరిక!
కొడుకు మొహంలో బెదురును చూసి, "జాగ్రత్త లేక పోతే ఎలా కన్నా...ఎల్లు, బడికి ఏలయిందిగా"అంది.
కలో నిజమో అర్థం కాలేదు కిట్టిగాడికి!
ఆశ్చర్యపోతూనే, కిటికీలోంచి పుస్తకాలు తీసుకుని బడికి బయల్దేరాడు.
పోయిన డబ్బు గురించి వాడి కళ్ళు దారంతా వెదుకుతూనే ఉన్నాయి.
* * *
చెప్పాపెట్టకుండా, స్కూలు వదిలే టైంకు విచ్చేసిన స్కూళ్ళ ఇనస్పెక్టర్ ని చూసి, స్కూలు స్కూలంతా ఉలిక్కిపడింది.
ఇనస్పెక్టర్ గారు ఆఫీసు గదిలో అటెండెన్స్ రికార్డులు చూస్తుంటే, క్లాసుల్లో టీచర్లు, ఇనస్పెక్టర్ ముందు పిల్లలెలా బుద్ధిగా నడుచుకోవాలో గబగబా తర్ఫీదు ఇవ్వడం, కాస్త బాగా చదివే పిల్లల్ని ముందు వరసలో కూర్చో పెట్టడం మొదలెట్టారు.
నాలుగోతరగతి బి సెక్షన్ లో, కిట్టిగాణ్ణి వాళ్ళ టీచరు ముందు వరసలో కూర్చో పెట్టాడు.
ఇనస్పెక్టర్ ఆ క్లాసులోకి వచ్చాడు. పిల్లలెంత మంది క్లాసులో వున్నారో చూసి, హాజరు పట్టీలోని సంఖ్యతో సరి పోల్చుకున్నారు.
పాఠాలెంత వరకు అయ్యాయో టీచర్ని అడిగి తెలుసుకున్నారు.
వంద రూపాయలకు ఆరు తెల్ల చొక్కాలు వస్తే, ఒక్కొక తెల్ల చొక్కా వెల ఎంతో - బోర్డు మీద లెక్క వెసి చెప్పమన్నారు కిట్టిగాణ్ణి.
అరడుగు ఎత్తులో ఉన్న డయాస్ ఎక్కుతున్నప్పుడు, ఇనస్పెక్టర్ కుర్చీ పక్కనే పడున్న తెల్ల కాగితమొకటి కనిపించింది కిట్టిగాడికి.
అది పూర్తిగా తెల్ల కాగితమా, లేక ఒక వైపు రాసిన కాగితమా అని అలోచిస్తూనే లెక్క పూర్తి చేసాడు.
ఇనస్పెక్టర్ 'వెరీ గుడ్' అని మెచ్చుకున్నారు.
డయాస్ మీదనుంచి దిగబోతూ, కాగితాన్ని తీసుకుందామనుకున్నాడు కానీ...అందరూ చూస్తుండగా తీసుకుంటే...ఇనస్పెక్టర్ కాగితాన్ని లాగేసుకుంటాడేమోననిపించింది. అలాగని వదిలెస్తే, ఇనస్పెక్టరో, టీచరో ఆ తల్ల కాగితాన్ని తొక్కేస్తారేమోనని భయమేసింది. కాగితాన్నే చూస్తూ, వాడి ప్లేసులో కాస్త నిటారుగా కూర్చున్నాడు!
మరో నలుగురైదుగురు పిల్లల్ని ప్రశ్నలడిగి...అందరినీ మెచ్చుకుని, బయటకు వెళ్ళారు ఇనస్పెక్టర్.
టీచర్ కూడా పిల్లలందరినీ మెచ్చుకున్నారు.
స్కూలుకు ఇంటి గంట కొట్టారు.
టీచర్ బయటకు వెళ్ళాక, పిల్లలందరూ పోలోమంటూ, ఒకళ్ళనొకళ్ళు తోసుకుంటూ బయటకు వెళుతుంటే, కిట్టిగాడు మాత్రం నెమ్మదిగా పుస్తకాలు సర్దుకుంటూ కూర్చుని, అందరూ బయటకు వెళ్ళారనుకున్నాక - డయాస్ మీదకు ఎక్కి నేల మీది తెల్ల కాగితాన్ని జాగ్రత్తగా తీసుకుని, రెండో వైపు తిప్పి చూసాడు ఆత్రంగా...అటు వైపూ తెలుపే!
అందరాని చందమామ చేతిలోక్కినట్లనిపించింది కిట్టిగానికి.
ఆ కాగితం వైపు మురిపెంగా చూసుకుని, దాని మీద అంటుకున్న చాక్పీస్ పొడిని నెమ్మదిగా నోటితో ఊది, సంచిలో పుస్తకాల మధ్యన దాచుకున్నాడు. క్లాస్ రూంలో చుట్టూ ఒకసారి చూసాడు. కిటికీల లోంచి ఎవరైనా గమనిస్తున్నారేమోనని, జాగ్రత్తగా బయటకు చూసాడు.
నెమ్మదిగా అడుగులో అడుగేసుకుంటూ, బయటకొచ్చాడు.
నడుస్తూ నడుస్తూ, మధ్య మధ్యలో చుట్టూ చూసుకుంటూ బయటకొస్తున్న కిట్టిగాణ్ణి, దొంగ పోలీస్ ఆటకు రమ్మని పిలిచాడు.
ముందు ఉలిక్కి పడ్డా, తర్వాత నిబ్బరంగానే - ఇంటి దగ్గర పనుందని చెప్పి, ఎవరో వెనకపడి తరుముతున్నట్లు పరుగు లాంటి నడకతో ఇంటికి చేరాడు.
ఇంట్లో ఎవరూ చూడకుండా, చెక్క పెట్టెలో ...అడుగున నాలుగు పేపర్ల మధ్యన తెల్ల కాగితాన్ని భద్రంగా దాచాడు!
రాత్రి నిద్ర పోయాడనేగానీ, ఒకటే కలలు.
తెల్ల కాగితం దొంగ కిట్టిగాడేనని ఇనస్పెక్టర్ పోలీసులకు చెప్పినట్లు, వాళ్ళు రబ్బరు చెట్ల బెత్తాలతో అర చేతులపై కొట్టి, స్కూలయ్యేదాకా గోడ కుర్చీ వేయించినట్లు...ఇంకెప్పుడూ దొంగతనం చేయనని ఒక వంద సార్లు రాయమని పనిష్మెంటు ఇచ్చినట్లు వొచ్చిన కలొక్కటే గుర్తుంది కిట్టిగాడికి.
మర్నాడు ఉదయం అందరికంటే ముందు లేచి, చెక్క పెట్టె తెరిచి తెల్ల కాగితాన్ని చూసుకున్నాడు.
రోజూ కంటే ముందుగా బడికి బయల్దేరాడు. ఎందుకైనా మంచిదని పేపర్ల మధ్యన దాచుకున్న తెల్ల్ కాగితాన్ని తీసుకుని, బిక్కు బిక్కుమంటూ స్కూలుకు వెళ్ళాడు.
దారిలో అందరూ తనను దొంగను చూసినట్లు చూస్తున్నారనుకున్నాడు.
క్రితం రోజు పోగొట్టుకున్న డబ్బుల సంగతి గుర్తు కొచ్చింది.
బహుశా ఇనస్పెక్టర్ కూడా తెల్ల కాగితం గురించి వెదుక్కుని, బాధ పడి వుంటాడేమోననిపించింది కిట్టిగాడికి.
ఎవరో తనను నీడలా వెంటాడుతున్నట్లు, 'దొంగ దొంగ' అని పిలుస్తున్నట్లు అనిపించింది.
బడికి వెళ్ళి, వాళ్ళ క్లాసు టీచర్ ను కలిసాడు.
నిన్న సాయంత్రం, క్లాసు రూము డయాస్ మీద తెల్ల కాగితం దొరికిందని...అది ఇనస్పెక్టర్ గారిది అయ్యుండొచ్చని చెప్పి - పేపర్ల మధ్యన దాచిన తెల్ల కాగితాన్ని, టీచర్ గారికి ఇచ్చాడు.
టీచర్ నవ్వుతూ "ఇనస్పెక్టర్ గారికి తెల్ల కాగితాలకేమి కొదవరా... దీన్ని నువ్వే ఉంచేసుకో"అన్నాడు, చాలా తేలిగ్గా.
టీచర్ గారి ఔదార్యానికి, కిట్టిగాడు పొంగిపోయాడు!
తెల్ల కాగితాన్ని ఆప్యాయంగా అందుకుని, పేపర్ల మధ్యన దాచుకున్నాడు.
ఇంటికెళ్ళగానే, పెట్టె అడుగున తెల్ల కాగితాన్ని, మిగిలిన పేపర్లతో బాటు దాచుకున్నాడు.
* * *
కిట్టిగాడు ప్రక్క వూరి హైస్కూల్లో ఆరోతరగతిలో చేరే రోజు.
తులసమ్మ ఆనందం అంతా ఇంతా కాదు!
కొడుకుకు నాలుగో సారి దిష్టి తీస్తున్నప్పుడు, కిట్టిగాడి కోసం రమణ వొచ్చాడు "ఇక ఎల్దామా" అంటూ.
ఉత్త చేతులతో బయల్దేర బోయిన కిట్టిగాణ్ణి..."ఇంకా నువ్వు టీసీ తెచ్చుకోలేదా" అనడిగాడు.
అదేమిటన్నట్లు అమాయకంగా చూస్తున్న కిట్టిగాడికి, తన చేతులో ఉన్న కాగితాలను చూపించి - "ఇవి లేక పోతే హైస్కూల్లో జేర్పించుకోరంట"అని చెప్పాడు.
'వాటిని ఎవరిస్తారు'అని అడిగితే, 'మన స్కూల్లోనే ఇస్తారు'అని చెప్పాడు.
కాగితం మీద అర్జీ వ్రాసి, అమ్మ చేతనో నాన్న చేతనో సంతకమో వేలుముద్రో వేయించి స్కూల్లో ఇస్తే, అవసరమైన కాగితాలు ఇస్తారు. ఒకవేళ అర్జీ రాయడం రాక పోతే, ఉత్త కాగితం మీద వేలు ముద్రో సంతకమో చేస్తే...మిగిలిన వివరాలు స్కూలు వాళ్ళు రాసుకుని హైస్కూల్లో చేరేందుకు అవసరమైన పత్రాలు ఇస్తారు.
కిట్టిగాడు పుస్తకాలు పెట్టుకునే కిటికీలో ఒకటో అరో ఒకవైపున రాసున్న పేపర్లు తప్పితే తెల్ల కాగితం ఒక్కటీ కనబళ్ళేదు.
కోమటి కొట్టుకెళ్ళి తెల్ల కాగితం కొనుక్కురమ్మని కొంగు అంచున ముడేసుకున్న అర్థ రూపాయి బిల్లను తులసమ్మ తీస్తున్నప్పుడు, కిట్టిగాడికి...ఎప్పుడో పెట్టెలో దాచుకున్న తెల్ల కాగితం గురించి గుర్తొచ్చింది.
అప్పుడెప్పుడో స్కూల్ల ఇనస్పెక్టరొచ్చినప్పుడు దొరికిన కాగితం!
గబగబా లోపలకు వెళ్ళి పెట్టె తెరిచాడు.
ముక్క వాసన!
పైనున్న వస్తువుల్ని పక్కన పెడుతూ, అడుగునున్న పేపర్ల బొత్తును బయటకు తీసాడు.
సగానికి పైగా పేపర్లను చెదలు తినేసింది! పేపర్ల మధ్యలో సగమై మిగిలిన లేత గోధుమ వర్ణపు కాగితాన్ని చూసి, కిట్టిగాడి మనసు విలవిల్లాడింది.
గ్రహణం పట్టిన చంద్రుడిలా ఉన్న వాడి మొహాన్ని చూసి, చెదలు తినగా మిగిలిన ఒకప్పటి తెల్ల కాగితానికి కూడా జాలేసింది.
పాత పూరింట్లో, ఎప్పుడూ చెమ్మగా ఉండే నేల మీద చెద పురుగులు ప్రకృతి సహజం!!
కిట్టిగాడి కళ్ళలోంచి రాలి, చెద పట్టిన కాగితాన్ని మరింత బరువెక్కించిన కన్నీటి బొట్టును - సామాజిక, ఆర్థిక శాస్త్రవేత్తలు పరిశోధిస్తే - ఆ పసి మనసు ఏమేమి ఆలోచిస్తోందో, వేటి వేటిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తోందో తెలియ వచ్చేమో!
(గమనిక : కొన్ని సాంకేతిక ఇబ్బందుల వల్ల, ఈ కథను బ్లాగులో పెట్టడానికి ఇప్పటి వరకు కుదరలేదు.)
Monday, March 24, 2008
అందరాని చందమామ (కొత్తపాళీ గారి తెల్లకాగితం ఇతివృత్తం ఆధారంగా)
Wednesday, March 19, 2008
ఉదారంగా ఋణాల మాఫీ!
ఋణాలను మాఫీ చేయడం కన్నా మెరుగైన ఆలోచన పాలకులకు తట్టదా?
మార్క్ ట్వెయినో మరో పెద్దాయనో - ఆకలేసిన వాడికి చేపలు తెచ్చి ఇవ్వడం కంటే, చేపలు పట్టడం నేర్పడం మంచిదన్నాట్ట!
ప్రజాస్వామ్య ప్రభుత్వమంటే - ప్రజల కొరకు, ప్రజల చేత ఎన్నుకోబడిన నాయకులే కదా!
నాయకులు ఉదారంగా ఋణాల మాఫీలనీ, పావలా వడ్డీలని, ఉచిత కరెంటని - కిలో రెండు రూపాయలకు బియ్యమనీ - ఓట్ల డబ్బాలు నింపుకోడానికి ఖజానా ఖాళీ చేస్తుంటారు!
కష్టపడే వాడెప్పుడూ కష్టపడుతూనే ఉంటాడు.
గానుగెద్దులా పని చేస్తూ, పన్నులు కడుతూ, ఖజానా నింపడానికి ఉడత సాయం చేస్తూనే ఉంటాడు!
బియ్యాన్ని కిలో ఇరవై రూపాయలు పెట్టి కొంటూనే ఉంటాడు. పెరిగే ధరలను, వ్యయాలను అందుకోవడానికి మరింత కష్టపడుతూ ఉంటాడు...ఆదాయాన్ని పెంచుకుంటూ ఉంటాడు.
పెరిగిన ఆదాయం మీద పన్నులు కడుతూనే ఉంటాడు. అవి మళ్ళీ ఋణాల మాఫీకో - పావలాకి కిలో నూనె పధకానికో - ఒక ఓటు కొంటే రెండో ఓటు ఉచితం స్కీముకో తరలి పోతూనే ఉంటాయి!
కష్టపడుతూనే ఉంటాడు! ఉడత సాయం చేస్తూనే ఉంటాడు!! తరలి పోతూనే ఉంటాయి!!!
మార్క్ ట్వెయినో మరో పెద్దాయనో - ఆకలేసిన వాడికి చేపలు తెచ్చి ఇవ్వడం కంటే, చేపలు పట్టడం నేర్పడం మంచిదన్నాట్ట!
ప్రజాస్వామ్య ప్రభుత్వమంటే - ప్రజల కొరకు, ప్రజల చేత ఎన్నుకోబడిన నాయకులే కదా!
నాయకులు ఉదారంగా ఋణాల మాఫీలనీ, పావలా వడ్డీలని, ఉచిత కరెంటని - కిలో రెండు రూపాయలకు బియ్యమనీ - ఓట్ల డబ్బాలు నింపుకోడానికి ఖజానా ఖాళీ చేస్తుంటారు!
కష్టపడే వాడెప్పుడూ కష్టపడుతూనే ఉంటాడు.
గానుగెద్దులా పని చేస్తూ, పన్నులు కడుతూ, ఖజానా నింపడానికి ఉడత సాయం చేస్తూనే ఉంటాడు!
బియ్యాన్ని కిలో ఇరవై రూపాయలు పెట్టి కొంటూనే ఉంటాడు. పెరిగే ధరలను, వ్యయాలను అందుకోవడానికి మరింత కష్టపడుతూ ఉంటాడు...ఆదాయాన్ని పెంచుకుంటూ ఉంటాడు.
పెరిగిన ఆదాయం మీద పన్నులు కడుతూనే ఉంటాడు. అవి మళ్ళీ ఋణాల మాఫీకో - పావలాకి కిలో నూనె పధకానికో - ఒక ఓటు కొంటే రెండో ఓటు ఉచితం స్కీముకో తరలి పోతూనే ఉంటాయి!
కష్టపడుతూనే ఉంటాడు! ఉడత సాయం చేస్తూనే ఉంటాడు!! తరలి పోతూనే ఉంటాయి!!!
Subscribe to:
Posts (Atom)

