Saturday, January 3, 2009

మంత్రుల రాజీనామాలు!

అవినీతి వరదలై పారుతూనే ఉంది. ఆయేషాలు అన్యాయంగా బలై పోతూనే ఉన్నారు. యాసిడ్ వానల్లో స్వప్నాలు దగ్ధమౌతూనే ఉన్నాయి. రక్షక భటుల రాక్షస నీతి నిరాటంకంగా సాగుతూనే ఉంది. అన్నమో రామచంద్రా అంటూ రైతన్నలు, నేతన్నలు, మామూలు అన్నలు ఉరికొయ్యలు మోస్తూనే ఉన్నారు. అడపాదడపా బాంబులు ప్రేలుతూనే ఉన్నాయి. అక్కడక్కడా ఇంకా వంతెనలు కూలుతూనే ఉన్నాయి. ఎవడికి దొరికింది వాడు దోచేస్తూనే ఉన్నారు. కుంభకోణాల్లో ఎన్ని కోణాలో బయట పడుతూనే ఉన్నాయి. ఇంకా వ్రాసుకుంటూ పోతే ఎన్నో...ఎన్నెన్నో...
* * *
నైతిక బాధ్యత వహిస్తూ మంత్రులు రాజీనామాలు చేసారు.
* * *
ఎందుకు?
ప్రభుత్వాన్ని నడపడంలో విఫలమైనందుకు కాదు, పదవీ ప్రమాణ ఘట్టాన్ని విస్మరించినందుకు కాదు.
మరెందుకు??
ఓట్లను కొనలేక పోయినందుకు.
ఓటర్లను ఏమార్చలేక పోయినందుకు.
ఎన్నికల్లో పార్టీ ఓడినందుకు!